ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డేనని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు.
"ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిపినప్పుడు స్కాం ఎలా జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వం నడిపినా కూడా స్కామ్‌లు జరిగాయి. అదే విధంగా ఏపీలో కూడా విజయసాయిరెడ్డి ప్రణాళికతోనే ఈ కుంభకోణం జరిగింది" అని వెంకటరమణారెడ్డి అన్నారు.
"మద్యం కుంభకోణంతో తమకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి బుకాయిస్తున్నారు. కానీ, ఈ స్కామ్‌లో వైఎస్సార్‌సీపీ నేతలందరి హస్తం ఉంది. ఈ కుంభకోణం చేసింది వైఎస్సార్‌సీపీ నేతలు కాదని జగన్ చెప్పగలరా?" అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
అలాగే, టీడీపీ నేతలకు తప్పు చేయడానికి భయం ఉంటుందని, పార్టీకి చంద్రబాబు హెడ్మాస్టర్ లాంటి వారని ఆయన వ్యాఖ్యానించారు. "టీడీపీలో ఏ తప్పు చేసినా, చంద్రబాబు తప్పకుండా శిక్షిస్తారు. అందుకే మా పార్టీలో అవినీతికి ఆస్కారం ఉండదు" అని ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.