యూరప్‌లోని పలు కీలక విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున దాడి చేశారు. లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ దాడి ప్రభావానికి గురవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, విమానాల చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్‌లు స్తంభించిపోవడంతో షెడ్యూల్ పూర్తిగా దెబ్బతిన్నది. అనేక విమానాలు గంటల కొద్దీ ఆలస్యమవ్వగా, కొన్ని సర్వీసులు రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
బ్రసెల్స్ విమానాశ్రయం పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అక్కడి ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్‌లు పూర్తిగా పనిచేయకపోవడంతో ప్రయాణికులు టర్మినల్స్‌లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. లండన్, బెర్లిన్ విమానాశ్రయాల్లో కూడా అదే దృశ్యం కనిపించింది. అంతర్జాతీయ ప్రయాణాల కోసం సిద్ధమైనవారు హఠాత్తుగా ఈ సాంకేతిక సమస్యల వలన అసహనానికి గురయ్యారు. ముఖ్యంగా ట్రాన్సిట్ ప్రయాణికులు తమ కనెక్టింగ్ విమానాలను మిస్ అవ్వడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.
సైబర్ దాడి స్వరూపంపై అధికారులు విచారణ చేపట్టారు. విమానాశ్రయాల సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థలు, చెక్-ఇన్ కౌంటర్లు, బోర్డింగ్ గేట్లు అన్నీ ఒక్కసారిగా స్థంభించిపోయాయి. “మా సాంకేతిక బృందాలు నిరంతరం పని చేస్తున్నాయి. వీలైనంత త్వరగా సిస్టమ్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నాం” అని అధికారులు స్పష్టం చేశారు. అంతవరకు ప్రయాణికులు తమ విమానయాన సంస్థల వెబ్‌సైట్లు లేదా అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచించారు.
ఈ సంఘటన యూరప్‌లోని విమానాశ్రయాల సైబర్ భద్రతలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. ఇటీవల జపాన్ ఎయిర్‌లైన్స్‌పైనా ఇలాంటి దాడి జరిగిన విషయం తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ దాడులు అంతర్జాతీయ విమానయాన రంగంలో భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సైబర్ సెక్యూరిటీని మరింత బలపరచాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు, విమాన సేవలు నిరాటంకంగా కొనసాగడానికి ఇది అత్యవసరమని వారు హెచ్చరిస్తున్నారు.