ఆంధ్రప్రదేశ్‌లో 17 రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం (ఈసీ) పెద్ద షాకిచ్చింది. ఆ పార్టీలను రద్దు చేస్తూ, ఇకపై గుర్తింపు ఇవ్వబోమని స్పష్టంచేసింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా 474 గుర్తింపు లేని పార్టీలను ఈసీ తాజాగా రద్దు చేసింది. వీటిలో ఏపీలో 17, తెలంగాణలో 9 పార్టీలున్నాయి. గత ఆరు సంవత్సరాలుగా ఒక ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది. గతంలో ఆగస్టులోనే 334 పార్టీలను తొలగించగా, ఈసారి మరో 474ను కూడా రద్దు చేసింది. దీంతో కేవలం రెండు నెలల్లోనే 808 పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది.
ఆంధ్రప్రదేశ్‌లో రద్దైన పార్టీల జాబితాలో అనేక చిన్నచిన్న పార్టీలు ఉన్నాయి. అందులో భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆలిండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజా స్పందన పార్టీ, ఆలిండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడినవర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్‌ఆర్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగురాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ప్రాదేశిక స్థాయిలోనే ఉనికిని చూపించగా, గత ఆరు సంవత్సరాలుగా రాజకీయంగా అసలు ఎటువంటి చలనం లేకపోవడంతో రద్దు జాబితాలో చేరాయి.
తెలంగాణ రాష్ట్రానికి వస్తే.. లోక్‌సత్తా పార్టీతో పాటు మరో ఎనిమిది పార్టీలను ఈసీ రద్దు చేసింది. వాటిలో తెలంగాణ ప్రగతి సమితి, ఆలిండియా ఆజాద్ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఒకప్పుడు సక్రియంగా పనిచేశాయి కానీ, ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, పార్టీలు చురుకుగా లేనందువల్లే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సంఘం స్పష్టంచేసిన ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు 6 మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినవి 67 పార్టీలు. అయితే 2,046 పార్టీలు మాత్రం నమోదై ఉన్నా ఇప్పటికీ గుర్తింపు పొందలేదు. ఇక త్వరలోనే మరో 359 పార్టీలను కూడా ఈసీ జాబితా నుంచి తొలగించనుంది. వీటిలో ఏపీకి చెందిన 8, తెలంగాణకు చెందిన 10 పార్టీల వరకు ఉండబోతున్నాయి. ఎన్నికల్లో చురుకుగా పాల్గొనని, కేవలం రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే కొనసాగుతున్న పార్టీలను క్రమంగా తొలగిస్తూ, రాజకీయ వ్యవస్థను శుభ్రం చేసే పనిలో ఈసీ దూకుడు చూపిస్తోంది.