తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్ 2 పోస్టుల తుది ఫలితాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే తుది జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమైందని సమాచారం. నిజానికి ఈ ఫలితాలను మూడునెలల క్రితమే ప్రకటించాల్సి ఉండగా, గ్రూప్ 1 పోస్టుల చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదాలు కారణంగా ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అవాంతరాలు తొలగించడంతో ఫలితాల విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైనట్లైంది.
2022లో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 783 పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2024 డిసెంబరులో జరిగిన ఆఫ్‌లైన్ రాత పరీక్షకు 2,49,964 మంది హాజరయ్యారు. అయితే, ఓఎంఆర్ షీట్లలో పొరపాట్లు, బబ్లింగ్ లోపాలు వంటి కారణాలతో 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగతా 2,36,649 మందికి సంబంధించిన మార్కులతో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. మార్చి 11న విడుదలైన ఈ లిస్ట్ ఆధారంగా మూడు దఫాలుగా ధ్రువపత్రాల పరిశీలన జరిగింది.
ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత ఇప్పుడు తుది ఫలితాల విడుదల మిగిలి ఉంది. 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా త్వరలోనే వెలువడనుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది కీలకమైన సమయం. సంవత్సరాలుగా కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధమైన వారికి ఈ ఫలితాలే భవిష్యత్ మార్గాన్ని నిర్ణయించనున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఎప్పుడు అధికారికంగా ఫలితాలు విడుదల చేస్తుందో అనే అంశంపై అభ్యర్థులంతా ఉత్కంఠగా ఉన్నారు.
ఇక గ్రూప్ 3 నియామకాల విషయానికి వస్తే, మొత్తం 1,388 పోస్టుల కోసం 2024 నవంబరులో రాత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,67,921 మంది హాజరయ్యారు. సాంకేతిక కారణాల వల్ల 18,364 మందిని అనర్హులుగా ప్రకటించి, మిగిలిన 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను మార్చి 14న విడుదల చేశారు. జూన్‌లో ధ్రువపత్రాల పరిశీలన జరగాల్సి ఉండగా, గ్రూప్ 2 ఫలితాలు ఆలస్యం కావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. గ్రూప్ 2 నియామకాలు పూర్తయిన వెంటనే గ్రూప్ 3 తుది ప్రక్రియ పూర్తి చేయాలని కమిషన్ నిర్ణయించుకుంది.