కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడ-హైదరాబాద్ మధ్య Greenfield Express Highway నిర్మాణాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న రహదారిని ఆరు లైన్లుగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత ప్రయాణ సమయం సగానికి సగం తగ్గి, సుమారు రెండు నిమిషాల అర గంటలలో గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే, డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) తయారీకి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రూ.2.5 లక్షల కోట్ల విలువైన రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదనంగా, మరో రూ.1 లక్ష కోట్ల విలువైన పనులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రారంభించబోతున్నామని గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత రాష్ట్ర రహదారులు USA రోడ్ల మాదిరిగా అత్యాధునికంగా మారతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మంగళగిరిలో జరిగిన జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడారు. చంద్రబాబు దూరదృష్టిని ప్రశంసిస్తూ, మంచి నాయకత్వం ఉన్నపుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలసి పనిచేస్తున్న డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతోందన్నారు.
నీటి వనరులు, విద్యుత్, కమ్యూనికేషన్, రవాణా రంగాల్లో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని గడ్కరీ తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర స్థానాల్లో నిలవడం ఖాయమన్నారు. వరిగడ్డితో బిటుమిన్ తయారీ ద్వారా రహదారుల నిర్మాణంలో కొత్త ప్రయోగాలను కూడా చేపడుతున్నామని వెల్లడించారు.