Raghav Chadha: నీట్ పేపర్ లీక్‌పై ఎందుకు మౌనంగా ఉండేందుకు కారణం ఇదే.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వివరణ!

Raghav Chadha: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై తాను ఇంతకాలం ఎందుకు స్పందించలేదో రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో వివరించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సమస్యలను మీడియా ముందు వ్యాఖ్యలు చేయడం ద్వారా కాదు, శాశ్వత వ్యవస్థాపరమైన పరిష్కారాల ద్వారానే ఎదుర్కోవాలని అన్నారు.

Raghav Chadha
Raghav Chadha

ప్రశ్నలు కాదు.. పరిష్కారాలే ముఖ్యం: నీట్ అంశంపై రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు..

పేపర్ లీక్‌లపై సమగ్ర చట్టం.. రాజ్యసభలో రాఘవ్ చద్దా మద్దతు..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై తాను ఇంతకాలం ఎందుకు స్పందించలేదో రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో వివరించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సమస్యలను మీడియా ముందు వ్యాఖ్యలు చేయడం ద్వారా కాదు, శాశ్వత వ్యవస్థాపరమైన పరిష్కారాల ద్వారానే ఎదుర్కోవాలని అన్నారు.

రాజ్యసభలో మాట్లాడిన రాఘవ్ చద్దా, తాను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను ప్రశ్నించడం తన బాధ్యతగా నిర్వర్తించానని చెప్పారు. అయితే ఇప్పుడు అధికార పక్ష బెంచీల్లో ఉన్నందున తన పాత్ర మారిందని పేర్కొన్నారు.

"గతంలో ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత నాపై ఉంది. కెమెరాల ముందు మాట్లాడి వార్తల్లో నిలవడం నా లక్ష్యం కాదు. సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చిన రోజే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు అదే జరిగింది" అని ఆయన అన్నారు.

నీట్ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు కష్టపడుతుంటాడని రాఘవ్ చద్దా అన్నారు. కోటా, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవడం, కుటుంబానికి దూరంగా ఉండడం, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు భరిస్తూ పిల్లల చదువుకు సహకరించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. "విద్యార్థుల ఆగ్రహం సమంజసం. వారి బాధ నిజమైనదే. వారి భావోద్వేగాలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి" అని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల ఆందోళనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సంరక్షకుడిలా విన్నారని రాఘవ్ చద్దా అన్నారు. వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తొలిసారిగా సమగ్ర చట్టపరమైన వ్యవస్థను తీసుకొచ్చామని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వేగంగా స్పందించిందని ఆయన చెప్పారు.

నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రభుత్వం, కేవలం 75 రోజుల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసిందని రాఘవ్ చద్దా వెల్లడించారు.

భవిష్యత్తులో ఓఎంఆర్ (OMR) షీట్లకు బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నీట్ పరీక్షలు నిర్వహించే నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. దీంతో పరీక్షల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

పేపర్ లీక్‌లను రాజకీయ కోణంలో చూడకూడదని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న దీర్ఘకాలిక సమస్య అని, ఏ రాష్ట్రంలో జరిగినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తన ప్రసంగంలో పంజాబ్‌లో జూలై 19న నిర్వహించిన ఫార్మసీ ఆఫీసర్ నియామక పరీక్షలో బ్లూటూత్ పరికరాల ద్వారా నకిలీ విధానంలో పరీక్ష రాయించారని, ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.13 లక్షల వరకు వసూలు చేసిన వ్యవస్థీకృత మోసంపై ఆరోపణలు ఉన్నాయని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

అలాగే కర్ణాటకలో జనవరిలో జరిగిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ ప్రశ్నపత్రం లీక్ ఘటనను ప్రస్తావిస్తూ, అక్కడ ప్రశ్నపత్రాలను రూ.200కు విక్రయించారనే ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

పరీక్షలపై ప్రజల్లో మళ్లీ నమ్మకం పెరగాలంటే ఈ చట్టానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని రాఘవ్ చద్దా కోరారు. కష్టపడి చదివే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఇదిలా ఉండగా, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాల నినాదాలు, వాకౌట్ మధ్య వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది. పరీక్షల్లో అక్రమాలకు కట్టడి వేయడం, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

Tags

Be the first to react

Latest