Election Commission: ఏపీలో ఓటర్ల జాబితా సవరణపై కీలక సమీక్ష.. నాణ్యతకు పెద్దపీట!
Election Commission: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ సూచించారు. ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా దోషరహితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు అధికారులు, బీఎల్‌వోలు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
దోషరహిత ఓటర్ల జాబితా కోసం సమష్టి కృషి అవసరం: ఈసీఐ అధికారి..
వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ఓటర్లకు ఇంటి వద్దే సహాయం.. ఈసీఐ ఆదేశాలు..
విజయవాడ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ సూచించారు. ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా దోషరహితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు అధికారులు, బీఎల్‌వోలు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు SIR ప్రక్రియలో చూపుతున్న చొరవ అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు ఇదే స్ఫూర్తితో సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు.
43.71 లక్షల నోటీసుల పంపిణీ
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో గురువారం రాష్ట్రంలో SIR పురోగతిపై డా. పవన్ కుమార్ శర్మ సమీక్ష నిర్వహించారు. ఏపీ సీఈవో వివేక్ యాదవ్, అదనపు సీఈవో ఎస్. దిల్లీరావు, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, గుంటూరు కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, పల్నాడు కలెక్టర్ డా. కృతికా శుక్లా, తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి, పశ్చిమగోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి, బాపట్ల కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్, ఆయా జిల్లాల ఈఆర్‌వోలు సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు.
ప్రస్తుతం నోటీసుల జారీ, విచారణ, క్లెయిములు, ఫిర్యాదుల పరిష్కారం వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పురోగతిని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 43,71,397 నోటీసులు పంపిణీ చేయగా, వాటిలో 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయి విచారణ పూర్తయింది. నోటీసుల పంపిణీ, విచారణలో ముందంజలో ఉన్న జిల్లాలను ఆయన అభినందించారు. మిగిలిన జిల్లాలు కూడా వేగంగా, నాణ్యంగా, పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
నోటీసులపై విచారణ ప్రక్రియలో కర్నూలు జిల్లా మెరుగైన పనితీరు కనబరిచింది. అక్కడ ప్రస్తుతం కేవలం 15.18 శాతం విచారణ మాత్రమే పెండింగ్‌లో ఉండటాన్ని డా. పవన్ కుమార్ శర్మ ప్రత్యేకంగా ప్రస్తావించి జిల్లా కలెక్టర్‌ను అభినందించారు.
SIR ప్రక్రియ విజయవంతం కావాలంటే ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, సహకారం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఎవరికైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేయాలని, సమస్యలు ఎదురైతే ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు.
వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ఓటర్లకు ప్రత్యేక సహాయం
వృద్ధాప్యం, అనారోగ్యం లేదా ఇతర కారణాలతో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేని ఓటర్లకు అధికారులు ప్రత్యేక సహాయం అందించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుని ఇంటి సందర్శనలు నిర్వహించాలని చెప్పారు. అవసరమైన ఇతర మార్గాల ద్వారా కూడా ఓటర్లకు సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు.
నోటీసులపై విచారణ పూర్తయిన తర్వాత ఏఈఆర్‌వోలు న్యాయపరమైన అంశాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. క్వాసీ జ్యుడీషియల్ అధికారులుగా వ్యవహరిస్తున్న ఏఈఆర్‌వోలు ప్రతి కేసును అర్థం చేసుకుని న్యాయమైన తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
విచారణ ప్రక్రియలో వెనుకబడి ఉన్న శ్రీ సత్యసాయి, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, మార్కాపురం జిల్లాలు వేగం పెంచాలని సూచించారు. అలాగే విశాఖపట్నం వెస్ట్, పెందుర్తి, నెల్లూరు సిటీ, కదిరి, హిందూపూర్, ఉదయగిరి, పెనుకొండ, ఎర్రగొండపాలెం, తిరుపతి, సర్వేపల్లి తదితర నియోజకవర్గాలు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ 5న జరిగే ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నాటికి ఈ నియోజకవర్గాల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు.
ఫారం-6, 7, 8 పరిష్కారంపై సమీక్ష
సమావేశంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాల నిర్వహణ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ వంటి అంశాలను కూడా పరిశీలించారు. అదేవిధంగా ఫారం-6, ఫారం-7, ఫారం-8 స్వీకరణ, వాటి పరిష్కార ప్రక్రియపై కూడా సమీక్ష జరిగింది.
అక్టోబర్ 3న తుది జాబితా
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత, న్యాయం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పైస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్‌వోల వరకు సమన్వయంతో పనిచేస్తేనే దోషరహిత ఓటర్ల జాబితా సాధ్యమవుతుందని డా. పవన్ కుమార్ శర్మ పేర్కొన్నారు. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరుకు అవసరమైన సహకారం అందించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Be the first to react