HPV Vaccination: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లో ఏపీ రికార్డు పురోగతి.. 3.40 లక్షల మంది బాలికలకు టీకా!
HPV Vaccination: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో కీలకమైన హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న బాలికల్లో 98.47 శాతం మందికి ఇప్పటికే టీకా అందించారు. మిగిలిన బాలికలకు కూడా ఈ నెల 31లోగా వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు చేపట్టినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
బాలికలకు గుడ్‌న్యూస్.. ఏపీకి త్వరలో 1.90 లక్షల హెచ్‌పీవీ వ్యాక్సిన్ డోసులు..
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఏపీ కీలక అడుగు.. 98.47% హెచ్‌పీవీ టీకా పంపిణీ..
అమరావతి: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో కీలకమైన హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న బాలికల్లో 98.47 శాతం మందికి ఇప్పటికే టీకా అందించారు. మిగిలిన బాలికలకు కూడా ఈ నెల 31లోగా వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు చేపట్టినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
3.40 లక్షల మంది బాలికలకు టీకా
14–15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా హెచ్‌పీవీ టీకా అందిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, వార్డు లెక్కల ప్రకారం 14 ఏళ్లు నిండిన, 15 ఏళ్లు దాటని బాలికలు 3,45,377 మంది ఉన్నారు. వీరిలో గురువారం మధ్యాహ్నం నాటికి 3,40,108 మందికి టీకా అందించారు. ఇది 98.47 శాతం పురోగతికి సమానం.
మిగిలిన 5,269 మంది బాలికలకు ఆగస్టు 31లోగా టీకా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టీకాపై తొలినాళ్లలో ఉన్న అపోహలను పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల ద్వారా తొలగించగలిగామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తెలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.
కొత్తగా 14 ఏళ్లు నిండిన వారికి కూడా టీకా
తొలుత ఆగస్టు చివరి నాటికి నిర్దేశిత బాలికలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఏపీ ఇప్పటికే 98.47 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువును డిసెంబరు 31 వరకు పొడిగించింది.
అదే సమయంలో కొత్తగా 14 ఏళ్లు నిండిన బాలికలకు కూడా టీకా అందించేందుకు కేంద్రం నుంచి రాష్ట్రానికి 1,90,890 డోసులు త్వరలో రానున్నాయి. 14 ఏళ్లు నిండిన బాలికలు తల్లిదండ్రులతో కలిసి నేరుగా సమీపంలోని పీహెచ్‌సీ లేదా అర్బన్ హెల్త్ సెంటర్‌కు వెళ్లి టీకా తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇప్పటివరకు 3.81 లక్షల డోసులు
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కేంద్రం రెండు విడతల్లో కలిపి రాష్ట్రానికి 3,81,780 డోసులు అందించింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను సమర్థంగా వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పురోగతిని బట్టి కేంద్రం కూడా ఏపీకి తగిన ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. డిసెంబరు 31 తర్వాత హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను రొటీన్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా కొనసాగించనున్నారు.
టీకా తీసుకున్న బాలికల్లో రియాక్షన్ కేసులు లేవు
టీకా భద్రతపై రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్‌బాబు కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు హెచ్‌పీవీ టీకా తీసుకున్న సుమారు 3.40 లక్షల మంది బాలికల్లో ఎలాంటి రియాక్షన్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇది ప్రభావవంతమైనదే కాకుండా సురక్షితమైన టీకా అని వివరించారు.
టీకా ఇచ్చిన తర్వాత బాలికలను 30 నిమిషాల పాటు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు తెలిపారు. కోల్డ్ చైన్ సదుపాయం ఉన్న పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గార్డాసిల్-4 క్వాడ్రివాలెంట్ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సింగిల్ డోస్ విధానంలో 0.5 మి.లీ. మోతాదుగా ఎడమ పైభుజంలో ఇంట్రామస్క్యులర్‌గా ఇస్తున్నట్లు చక్రధర్‌బాబు వివరించారు.
జిల్లాల వారీగా టీకా పురోగతి
వ్యాక్సినేషన్‌లో కొన్ని జిల్లాలు లక్ష్యాన్ని మించి పురోగతి సాధించగా, మరికొన్ని జిల్లాలు ఇంకా మెరుగైన కవరేజీ సాధించాల్సి ఉంది. అనకాపల్లి – 103.93%, బాపట్ల – 103.54%, చిత్తూరు – 102.15%, కాకినాడ – 103.51%, కోనసీమ – 104.12%, కృష్ణా – 103.52%, కర్నూలు – 100.72%, మార్కాపురం – 112.64%, నంద్యాల – 101.83%, ఎన్‌టీఆర్ – 100.58%, పల్నాడు – 103.49%, పార్వతీపురం మన్యం – 101.51%, తిరుపతి – 103.67%, వైఎస్సార్ – 105.00% జిల్లాలు 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ పురోగతి సాధించగా, అనంతపురం – 94.57%, అన్నమయ్య – 95.81%, తూర్పు గోదావరి – 99.52%, ఏలూరు – 94.30%, ప్రకాశం – 96.45%, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – 95.22, శ్రీ సత్యసాయి – 96.37%, శ్రీకాకుళం – 98.12%, విశాఖపట్నం – 92.31%, విజయనగరం – 98.84%, పశ్చిమ గోదావరి – 99.19% జిల్లాలు 90 నుంచి 99.99 శాతం సాధించాయి. అలాగే అల్లూరి సీతారామరాజు – 54.51%, గుంటూరు – 87.20%, పోలవరం – 73.68% జిల్లాలు 90 శాతం కంటే తక్కువ పురోగతి సాధించాయి.
రాష్ట్రవ్యాప్తంగా 98.47 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ, మిగిలిన 5,269 మంది బాలికలకు కూడా నిర్ణీత గడువులో టీకా అందించడమే ప్రభుత్వ తదుపరి లక్ష్యం. కొత్తగా 14 ఏళ్లు నిండిన బాలికలకు కూడా కేంద్రం నుంచి డోసులు అందుబాటులోకి రానుండటంతో కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో ముందస్తు రక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తూ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది.
Be the first to react