Anna Lezhneva: పవన్ కల్యాణ్ బాటలోనే సతీమణి... ఆ రెండింటిని దత్తత తీసుకున్న అన్నా లెజినోవా..!!

Anna Lezhneva: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (Anna Konidela) తన పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లోని ఒక ఆసియా ఏనుగు, ఒక రాయల్ బెంగాల్ పులిని ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. వాటి ఆహారం, వైద్యం మరియు సంరక్షణ కోసం మొత్తం రూ. 6.30 లక్షల విరాళం అందజేశారు.

పవన్ కల్యాణ్ బాటలోనే అన్నాలెజినోవా
పవన్ కల్యాణ్ బాటలోనే అన్నాలెజినోవా
  • రాయల్ బెంగాల్ టైగర్, ఏనుగు సంరక్షణ బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం భార్య..!!

  • విశాఖ జూ అధికారులు సాదర స్వాగతం

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

Anna Lezhneva: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. పుట్టినరోజున ఆడంబరాలకు దూరంగా ఉంటూ, పర్యావరణ జీవ వైవిధ్యానికి తోడ్పడేలా విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (జూ పార్క్)లో అమలవుతున్న 'జంతు దత్తత పథకం' (Animal Adoption Programme) కింద రెండు ప్రధాన వన్యప్రాణులను ఏడాది పాటు సంరక్షించే బాధ్యతను స్వీకరించారు.

ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా ఆసియా ఏనుగు (Asiatic Elephant) మరియు రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) సంరక్షణ కోసం ఆమె మొత్తం రూ. 6,30,000 విరాళంగా అందజేశారు. ఇందులో భారత జాతీయ వారసత్వ జంతువు అయిన ఆసియా ఏనుగు ఆహారం, పోషణ, వైద్య సంరక్షణ నిమిత్తం రూ. 4.30 లక్షలు, అలాగే భారత జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ పులి నిర్వహణ కోసం రూ. 2 లక్షలు కేటాయించారు. ఈ నిధులను ఏడాది పాటు వాటి బాగోగులు, మెరుగైన వసతుల కోసం జూ అధికారులు వినియోగించనున్నారు.

గతంలో పవన్ కల్యాణ్ కూడా వన్యప్రాణుల సంరక్షణ దిశగా అడుగులు వేసి జూపార్క్‌లోని జిరాఫీలను దత్తత తీసుకుని ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భర్త బాటలోనే అన్నా కొణిదెల కూడా అడుగులు వేస్తూ విశాఖ జూలో ఏనుగు, పులిని దత్తత తీసుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా (ఇన్‌స్టాగ్రామ్) ద్వారా పంచుకుంటూ జూలో ఏర్పాటు చేసిన నేమ్‌బోర్డుల ఫోటోలను షేర్ చేశారు.

విశాఖపట్నం జూ పార్క్ క్యూరేటర్ జి. మంగమ్మ మాట్లాడుతూ.. అన్నా కొణిదెల దత్తత నిర్ణయాన్ని సాదరంగా ఆహ్వానించారు. సమాజంలో ఉన్న ప్రముఖులు మరియు పౌరులు ఇటువంటి దత్తత కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా వన్యప్రాణి సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, ఇది ఇతర జీవుల శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతుందని ఆమె తెలిపారు.

అన్నా కొణిదెల తీసుకున్న ఈ ఆదర్శవంతమైన నిర్ణయం పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పుట్టినరోజు వేడుకలను ఇలా అర్థవంతంగా, మూగజీవాలకు ఉపయోగపడేలా జరుపుకోవడం పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Be the first to react

Latest