కర్ణాటకలో 37 ఏళ్ల తర్వాత విద్యార్థి సంఘం ఎన్నికలు.. ఈ ఏడాది నుంచే అమలు
కర్ణాటకలో విద్యార్థి రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిలిచిపోయిన కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘం ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కర్ణాటకలో విద్యార్థి రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిలిచిపోయిన కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘం ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర వెల్లడించారు. క్యాంపస్‌లలో గతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, విద్యార్థుల మధ్య ఘర్షణల నేపథ్యంలో 1989లో విద్యార్థి సంఘం ఎన్నికలపై నిషేధం విధించారు. తాజాగా ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఎన్నికలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది.
రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష అవకాశం లేదు
విద్యార్థి సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు లేదా వాటికి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలకు ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యార్థులు తమ వ్యక్తిగత హోదాలో స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో బరిలోకి దిగవచ్చు. ఈ విధానం ద్వారా క్యాంపస్ రాజకీయాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విద్యా సంవత్సరం నుంచే ఎన్నికలు
కర్ణాటకలో ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిగ్రీ కళాశాలలు, ప్రీ-యూనివర్సిటీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.
37 ఏళ్ల విరామం తర్వాత విద్యార్థి సంఘం ఎన్నికలు తిరిగి రావడంతో రాష్ట్రంలోని విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది.
Tags
Be the first to react