శివుడికి భక్తుల ఉత్తరాలు.. కొన్ని నవ్వించగా మరికొన్ని కంటతడి పెట్టించాయి
దేవుడికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా భక్తులు శివుడికి రాసిన కొన్ని ఉత్తరాలు బయటపడటం ఆసక్తికరంగా మారింది
దేవుడికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా భక్తులు శివుడికి రాసిన కొన్ని ఉత్తరాలు బయటపడటం ఆసక్తికరంగా మారింది
తమ కోరికలను నెరవేర్చాలని కోరుతూ కొందరు భక్తులు ఈ లేఖలను ఆలయ హుండీలో వేశారు. వాటిని పరిశీలించిన ఆలయ సిబ్బందికి భిన్నమైన అనుభవం ఎదురైంది. కొన్ని ఉత్తరాల్లో భక్తుల అమాయకత్వం, హాస్యం కనిపించగా.. మరికొన్ని లేఖలు తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి.
‘కోరిక తీరితే మందు మానేస్తా.. చివరిసారి మాత్రం’
ఓ భక్తుడు తన కోరిక నెరవేరితే ఇకపై మద్యం సేవించబోనంటూ శివుడిని వేడుకున్నాడు. అయితే మద్యం పూర్తిగా మానేయడానికి ముందు ఒక్కసారి చివరిసారిగా తాగేందుకు అనుమతించాలని కోరడం ఆ లేఖలో కనిపించింది.
తన కోరిక ఎన్నో రోజులుగా ఉందని, అది నెరవేరితే జీవితాంతం మద్యం జోలికి వెళ్లనని భక్తుడు పేర్కొన్నాడు. అయితే ‘చివరిసారి’ అనే షరతు పెట్టడం అక్కడి సిబ్బందికి నవ్వు తెప్పించింది.
చిన్నారి లేఖకు సిబ్బంది ఫిదా
మూడో తరగతి చదువుతున్న ఓ బాలిక రాసిన ఉత్తరం కూడా ప్రత్యేకంగా నిలిచింది. తన నోట్‌బుక్ నుంచి కాగితం తీసుకుని శివుడికి లేఖ రాసిన ఆ చిన్నారి.. పరీక్షల్లో తనను పాస్ చేయించాలని దేవుడిని కోరింది.
తనకు కావాల్సిన కోరికను సూటిగా చెప్పిన ఆ బాలిక.. లేఖ చివర్లో తాను రాసిన విషయాలను కూడా పేర్కొంది. హిందీ, జీకే, ఈవీఎస్ సబ్జెక్టుల్లో పాస్ చేయించాలని కోరుతూ రాసిన ఈ చిన్నారి ఉత్తరం ఆలయ సిబ్బందిలో చిరునవ్వులు పూయించింది.
కన్నీళ్లు తెప్పించిన భక్తుల బాధలు
అయితే హుండీలో లభించిన ప్రతి లేఖలోనూ హాస్యమే కనిపించలేదు. కొన్ని ఉత్తరాల్లో భక్తుల బాధ, ఆవేదన స్పష్టంగా కనిపించింది.
తన మృతిచెందిన తమ్ముడు తిరిగి జన్మించి తమ కుటుంబంలోకి రావాలని ఓ మహిళ శివుడిని వేడుకుంది. తన కడుపున మళ్లీ పుట్టి ఇంటికి తిరిగి రావాలని ఆమె రాసిన లేఖ చదివిన ఆలయ సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు.
అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న మరో మహిళ తన ఆరోగ్యాన్ని కాపాడాలని, వ్యాధి నుంచి విముక్తి కల్పించాలని శివుడిని ప్రార్థిస్తూ లేఖ రాసింది. ఈ ఉత్తరాలు చదివిన సిబ్బంది భక్తుల విశ్వాసంతో పాటు వారి వ్యక్తిగత బాధలను చూసి చలించిపోయారు.
అచలేశ్వర్ మహాదేవ్ ఆలయ హుండీ నుంచి వెలుగులోకి వచ్చిన ఈ ఉత్తరాలు భక్తులకు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని, తమ జీవితంలోని సంతోషాలు, బాధలను ఆయనతో పంచుకునే భావోద్వేగాన్ని తెలియజేస్తున్నాయి.
Tags
Be the first to react