అతిలోక సుందరి శ్రీదేవి భూవివాదం... కపూర్ కుటంబానికి సుప్రీమ్ కోర్ట్ నోటీస్.
న్యూఢిల్లీ: దివంగత నటి శ్రీదేవికి సంబంధించిన భూ వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని షోలింగనల్లూరులో ఉన్న 2.7 ఎకరాల భూమిపై హక్కులు తమకూ ఉన్నాయని పేర్కొంటూ ఎంసీ చంద్రశేఖరన్ వారసులుగా చెప్పుకుంటున్న ఎంసీ శివగామి, ఎంసీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు నోటీసులు జారీ చేసింది.
- చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో శ్రీదేవికి సంబంధించిన 2.7 ఎకరాల భూమిపై వివాదం.
- హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: దివంగత నటి శ్రీదేవికి సంబంధించిన భూ వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని షోలింగనల్లూరులో ఉన్న 2.7 ఎకరాల భూమిపై హక్కులు తమకూ ఉన్నాయని పేర్కొంటూ ఎంసీ చంద్రశేఖరన్ వారసులుగా చెప్పుకుంటున్న ఎంసీ శివగామి, ఎంసీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లి సభ్యులుగా ఉన్న ధర్మాసనం.. వివాదాస్పద భూమిపై తదుపరి విచారణ వరకు ప్రస్తుత స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇరుపక్షాల మధ్య వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అవకాశాన్ని కూడా పరిశీలించింది. ఇందుకోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమిస్తామని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 18కు వాయిదా వేసింది.
అసలు వివాదం ఏమిటి?
చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో షోలింగనల్లూరులో సర్వే నంబర్ 1/1బీలో ఉన్న భూమిపై ఎంసీ శివగామి, ఎంసీ నటరాజన్ హక్కు కోరుతున్నారు. తాము ఎంసీ చంద్రశేఖరన్ వారసులమని, ఆయన తమ తండ్రి అని వారు కోర్టుకు తెలిపారు.
ఈ భూమిని ఐదు సమాన భాగాలుగా విభజించి, అందులో తమకు 1/5 వాటా ఇవ్వాలని వారు కోరారు. అలాగే 1988 ఏప్రిల్ 19న రాజేశ్వరి, శ్రీలత, శ్రీదేవికి అనుకూలంగా జరిగిన సేల్ డీడ్లను రద్దు చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.
మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది?
ఈ వివాదంపై దాఖలైన కేసును ట్రయల్ కోర్టు మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసింది. పిటిషనర్ల వాదనలను పరిశీలించిన హైకోర్టు.. వారు దాఖలు చేసిన దావా గడువు ముగిసిన తర్వాత వచ్చిందని పేర్కొంది. దీంతో ఆ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ దావాను కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ శివగామి, నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనే తాజాగా అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
కపూర్ కుటుంబం వాదన ఇదే
శ్రీదేవి కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. 1988లోనే వివాదాస్పద ఆస్తిని శ్రీదేవి కుటుంబానికి విక్రయించినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్లు 2025 ఏప్రిల్ 20న దావా దాఖలు చేశారని, అయితే ఆస్తి మ్యుటేషన్ కోసం శ్రీదేవి మరణం తర్వాత 2023లోనే తమ క్లయింట్లు దరఖాస్తు చేసుకున్నారని సింఘ్వీ తెలిపారు. మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే పిటిషనర్లు కేసు వేశారని ఆయన వాదించారు.
ఈ వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు పరిశీలిస్తూ నోటీసులు జారీ చేసింది. వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అంశాన్ని కూడా కోర్టు పరిశీలించనుంది.
Tags
Be the first to react
