పుస్తకం చదవండి.. డబ్బులు పొందండి! సింగపూర్‌లో కొత్త పథకం

Singapore ReadSG: సింగపూర్‌లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు ‘ReadSG’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు కనీసం 15 నిమిషాలు పుస్తకాలు చదివితే వర్చువల్ పాయింట్లు పొందే అవకాశం ఉంది. సేకరించిన పాయింట్లను రివార్డులుగా మార్చుకోవచ్చు. పుస్తక పఠనాన్ని పెంచడం, స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం, అలాగే సామాజిక కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

పుస్తకం చదివితే డబ్బులు ఇస్తారు.
పుస్తకం చదివితే డబ్బులు ఇస్తారు.

 పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరగడంతో పాటు ఇప్పుడు డబ్బులు కూడా సంపాదించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది?సింగపూర్‌లో ప్రారంభించిన ఓ ప్రత్యేక కార్యక్రమం ఇదే ఆలోచనతో ప్రజలను పుస్తక పఠనం వైపు ప్రోత్సహిస్తోంది.

సింగపూర్‌లో ‘ReadSG’ పేరుతో నిర్వహిస్తున్న National Reading Month కార్యక్రమంలో భాగంగా ప్రజలను ప్రతిరోజూ కొంత సమయం పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో పాల్గొనే వారు రోజుకు కనీసం 15 నిమిషాల పాటు పుస్తకం చదివితే 20 వర్చువల్ పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా సేకరించిన 1,000 పాయింట్లకు ఒక సింగపూర్ డాలర్  విలువగా నిర్ణయించినట్లు సమాచారం. కార్యక్రమంలో పాల్గొనేవారు తమ పఠన సమయాన్ని ‘CrowdTask’ అనే ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

 ఈ కార్యక్రమం ఎందుకు?

స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రజల స్క్రీన్ టైమ్ కూడా గణనీయంగా పెరిగింది. అదే సమయంలో పుస్తక పఠనానికి కేటాయించే సమయం తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలను మళ్లీ చదవడం వైపు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా చెబుతున్నారు.

సింగపూర్ నేషనల్ లైబ్రరీ బోర్డు 2024లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, పుస్తకాలు చదివే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో పఠన అలవాటును ప్రోత్సహించడంతో పాటు అధిక స్క్రీన్ టైమ్‌ను తగ్గించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.

 చదవడంతో పాటు సామాజిక సేవ

ఈ కార్యక్రమం కేవలం వ్యక్తులకు రివార్డులు అందించడానికే పరిమితం కాదు. ప్రజలు నమోదు చేసే మొత్తం రీడింగ్ టైమ్ ఆధారంగా సామాజిక కార్యక్రమాలకు కూడా నిధులు అందించనున్నారు.

మొత్తం 75 లక్షల నిమిషాల పఠన సమయం నమోదైతే వివిధ సామాజిక కార్యక్రమాల కోసం 1.5 లక్షల సింగపూర్ డాలర్ల వరకు నిధులు అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంతో పాటు సామాజిక సేవలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం ప్రత్యేకతగా మారింది.

Tags

Be the first to react

Latest