South Africa: దక్షిణాఫ్రికాలో గాంధీజీ జ్ఞాపకాలకు నివాళి.. ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో ఏపీ స్పీకర్!
Speaker Ayyanna Patrudu In South Africa: దక్షిణాఫ్రికాలోని చారిత్రాత్మక ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం సందర్శించారు. మహాత్మా గాంధీ సత్యాగ్రహం, సర్వోదయ సిద్ధాంతాలకు పునాది పడిన ఈ చారిత్రక ప్రదేశంలో పర్యటించిన ఆయన.. గాంధీజీ జ్ఞాపకాలను స్మరించుకున్నారు. సత్యాగ్రహం జన్మస్థలాన్ని సందర్శించడం తనకు ఒక పవిత్ర యాత్ర వంటిదని స్పీకర్ పేర్కొన్నారు.
గాంధీజీ మునిమనవడితో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక భేటీ..
సత్యాగ్రహం పుట్టిన నేలపై అయ్యన్నపాత్రుడు.. ‘ఇది పవిత్ర యాత్ర’ అంటూ వ్యాఖ్య..
దక్షిణాఫ్రికాలోని చారిత్రాత్మక ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం సందర్శించారు. మహాత్మా గాంధీ సత్యాగ్రహం, సర్వోదయ సిద్ధాంతాలకు పునాది పడిన ఈ చారిత్రక ప్రదేశంలో పర్యటించిన ఆయన.. గాంధీజీ జ్ఞాపకాలను స్మరించుకున్నారు. సత్యాగ్రహం జన్మస్థలాన్ని సందర్శించడం తనకు ఒక పవిత్ర యాత్ర వంటిదని స్పీకర్ పేర్కొన్నారు.
సర్వోదయ హౌస్‌లో గాంధీజీకి నివాళి
డర్బన్‌లోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో గాంధీజీ, కస్తూర్బా గాంధీ నివసించిన ‘సర్వోదయ హౌస్’ను స్పీకర్ సందర్శించారు. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా గాంధీజీ తన పోరాటాన్ని కొనసాగించిన రోజులకు గుర్తుగా ఉన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
అదే ప్రాంగణంలో అప్పట్లో ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రికను ముద్రించిన చారిత్రాత్మక ప్రెస్‌ను కూడా స్పీకర్ పరిశీలించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఈ పత్రిక కీలక పాత్ర పోషించింది. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కూడా స్పీకర్ వెంట ఉన్నారు.
కస్తూర్బా గాంధీ పాఠశాల సందర్శన
ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లోని కస్తూర్బా గాంధీ ప్రాథమిక పాఠశాలను కూడా అయ్యన్నపాత్రుడు సందర్శించారు. గాంధీజీ ప్రతిపాదించిన సార్వజనీన సంక్షేమం, స్వావలంబన వంటి విలువలకు అనుగుణంగా విద్యార్థులకు విలువల ఆధారిత విద్య అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
విద్య ద్వారా స్థానిక సమాజాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గాంధీజీ ఆలోచనలను తరువాతి తరాలకు అందిస్తున్న పాఠశాల కృషి ప్రశంసనీయమని స్పీకర్ పేర్కొన్నారు.
గాంధీ మునిమనవడితో ప్రత్యేక భేటీ
ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మహాత్మా గాంధీ మునిమనవడు కిదార్ రామ్‌గోబిన్ సాదర స్వాగతం పలికారు. ఆయన ప్రముఖ వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి, మాజీ ఎంపీ డాక్టర్ ఎలా గాంధీ కుమారుడు.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు, కిదార్ రామ్‌గోబిన్ మధ్య భారత్–దక్షిణాఫ్రికా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఫీనిక్స్ సెటిల్‌మెంట్, పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వే స్టేషన్ వంటి గాంధీజీ చారిత్రక జ్ఞాపకాలతో ముడిపడిన ప్రదేశాల పరిరక్షణలో గాంధీ ట్రస్ట్ పాత్రపై చర్చించారు.
అలాగే భారత్, దక్షిణాఫ్రికాల మధ్య విద్యా, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా కిదార్ రామ్‌గోబిన్‌ను స్పీకర్ పెడన కలంకారీ శాలువాతో సత్కరించారు. ఏటికొప్పాక హస్తకళాకృతిని జ్ఞాపికగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కళలు, హస్తకళల ప్రత్యేకతను పరిచయం చేసేలా ఈ కానుక నిలిచింది.
‘సత్యం, అహింస అనే నైతిక ఆయుధాలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి’
ఫీనిక్స్ సెటిల్‌మెంట్ సందర్శన తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. సత్యాగ్రహం జన్మించిన ఈ ప్రదేశాన్ని సందర్శించడం పవిత్ర యాత్ర లాంటిదని అన్నారు.
మానవాళి ఆలోచనా విధానాన్ని మార్చిన సత్యం, అహింస అనే నైతిక ఆయుధాలను మహాత్మా గాంధీ ఈ ప్రాంతంలోనే మరింతగా మలిచారని పేర్కొన్నారు. గాంధీజీ వారసత్వాన్ని కస్తూర్బా స్కూల్ వంటి సంస్థల ద్వారా కొనసాగిస్తున్న గాంధీ కుటుంబం కృషి అభినందనీయమన్నారు. భారత్–దక్షిణాఫ్రికాల మధ్య చారిత్రక బంధానికి గాంధీజీ వారసత్వం ఒక స్ఫూర్తిదాయక వారధిగా నిలుస్తోందని స్పీకర్ పేర్కొన్నారు.
ఇండియా హౌస్‌లో కాన్సుల్ జనరల్‌తో భేటీ
ఫీనిక్స్ సెటిల్‌మెంట్ పర్యటన అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు డర్బన్‌లోని ఇండియా హౌస్ (భారత కాన్సులేట్ జనరల్)ను సందర్శించారు. అక్కడ కాన్సుల్ జనరల్ నితిన్ సుభాష్ యోలాయేతో సమావేశమయ్యారు.
ఈ భేటీలో దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన సహకారం, భారత్–దక్షిణాఫ్రికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇరు దేశాల అభివృద్ధికి పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు.
గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమానికి చారిత్రక నేపథ్యంగా నిలిచిన ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో ఏపీ శాసనసభ స్పీకర్ పర్యటన.. చరిత్రను గుర్తుచేసుకోవడంతో పాటు, రెండు దేశాల మధ్య విద్యా, సాంస్కృతిక, సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సందేశాన్ని కూడా ఇచ్చింది.
Tags
Be the first to react