Macherla: ఓటరు వెరిఫికేషన్‌లో వెలుగులోకి సంచలన విషయం.. 34 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న బంగ్లాదేశ్‌ వాసి!

Macherla: పల్నాడు జిల్లా మాచర్లలో ఆయుర్వేద వైద్యుడిగా స్థానికులకు పరిచయమైన ఓ వ్యక్తి అసలు బంగ్లాదేశ్‌కు చెందినవాడిగా గుర్తించడం కలకలం రేపింది. సుమారు 34 ఏళ్ల క్రితం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఓటరు వెరిఫికేషన్‌లో ఈ వ్యవహారం బయటపడింది.

Macherla
Macherla

1992లో భారత్‌లోకి అక్రమ ప్రవేశం.. మాచర్లలో స్థిరపడిన బంగ్లాదేశ్‌ వ్యక్తి..

మాచర్లలో 34 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యం.. తాజాగా బంగ్లాదేశ్‌ వ్యక్తిగా గుర్తింపు..

మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్లలో ఆయుర్వేద వైద్యుడిగా స్థానికులకు పరిచయమైన ఓ వ్యక్తి అసలు బంగ్లాదేశ్‌కు చెందినవాడిగా గుర్తించడం కలకలం రేపింది. సుమారు 34 ఏళ్ల క్రితం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఓటరు వెరిఫికేషన్‌లో ఈ వ్యవహారం బయటపడింది.

స్థానికంగా అందిన వివరాల ప్రకారం.. ఎంకే రాయ్‌ 1992లో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారు. కొంతకాలం వివిధ ప్రాంతాల్లో తిరిగిన అనంతరం మాచర్లకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ ఆయుర్వేద వైద్యం చేస్తూ క్రమంగా స్థానికంగా పేరు సంపాదించుకున్నారు. వైద్య వృత్తితో ఆర్థికంగా కూడా స్థిరపడి కుటుంబంతో మాచర్లలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

రాయ్‌ తాను పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా నుంచి వచ్చినట్లు స్థానికులకు చెప్పేవారని సమాచారం. అనంతరం భారత్‌లోనే ఆధార్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతాలు పొందినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా అధికారులు ఓటర్ల వివరాలను పరిశీలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓటరు స్థానికతను నిర్ధారించేందుకు పూర్వీకుల చిరునామా, కుటుంబ నేపథ్యంపై అధికారులు ఆరా తీశారు.

స్థానికతకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ రాయ్‌ను పిలిపించి విచారించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆయన పాస్‌పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నరసరావుపేట స్పెషల్‌ బ్రాంచ్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు రాయ్‌ను విచారించినట్లు సమాచారం. వారి విచారణలో ఆయన బంగ్లాదేశ్‌కు చెందిన హిందువుగా గుర్తించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

రాయ్‌ను నరసరావుపేటకు పిలిపించిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయనతో బేరసారాలకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాయ్‌ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఆ మొత్తాన్ని ఇద్దరు కానిస్టేబుళ్లు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ మధ్య పంచుకునే విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ రాయ్‌ను మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

రాయ్‌ అదనపు డబ్బు చెల్లించేందుకు అంగీకరించకపోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలపై పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుళ్లను పోలీసు శాఖ సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై శాఖాపరమైన విచారణ కొనసాగే అవకాశం ఉంది.

రాయ్‌ మొదట ఒంటరిగా మాచర్లకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకుని మాచర్లకు తీసుకొచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా సుమారు ఏడాది క్రితం తన అత్తను కూడా బంగ్లాదేశ్‌ నుంచి మాచర్లకు తీసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

34 ఏళ్లుగా మాచర్లలోనే ఉంటూ స్థానికంగా ఆయుర్వేద వైద్యుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అసలు నేపథ్యం తాజాగా బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓటరు వెరిఫికేషన్‌ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో పత్రాల జారీ, పాస్‌పోర్టు పునరుద్ధరణ, ముడుపుల ఆరోపణలపై అధికారుల తదుపరి విచారణ కీలకంగా మారింది.

Tags

1 readers have reacted

Latest