Nepal Floods: నేపాల్ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. తిరుపతికి చెందిన 28 మంది యాత్రికులు క్షేమం!
Nepal Floods: నేపాల్‌లో వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిలో ముఖ్యంగా ఏపీకి చెందిన యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. వివిధ మార్గాల్లో సమాచారం సేకరిస్తున్న ఆర్టీజీఎస్ (AP RTGS) అధికారులు, మానస సరోవర యాత్రకు వెళ్లిన వారిలో ఏపీ వాసులు ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల కోసం ఆరా.. 28 మంది తిరుపతి వాసులు సేఫ్..
నేపాల్ వరదలు.. ఏపీ యాత్రికుల క్షేమంపై ఆర్టీజీఎస్ ప్రత్యేక దృష్టి..
అమరావతి: నేపాల్‌లో వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిలో ముఖ్యంగా ఏపీకి చెందిన యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. వివిధ మార్గాల్లో సమాచారం సేకరిస్తున్న ఆర్టీజీఎస్ (AP RTGS) అధికారులు, మానస సరోవర యాత్రకు వెళ్లిన వారిలో ఏపీ వాసులు ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
ఇందులో భాగంగా మానస సరోవర యాత్రలను నిర్వహించే వివిధ టూరిస్ట్ సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రికుల క్షేమ సమాచారం, వారి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నారు.
ఖాట్మాండులో 28 మంది తిరుపతి యాత్రికులు
ఈ క్రమంలో తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం ఖాట్మాండులో ఉన్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు. యెల్లకొండ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఈ బృందం బస చేస్తున్నట్లు నిర్ధారించారు.
యాత్రికులతో అధికారులు మాట్లాడి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. తామంతా సురక్షితంగానే ఉన్నామని యాత్రికులు తెలిపారు. తమ పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులు సంప్రదించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినా, ఏదైనా సహాయం అవసరమైనా వెంటనే ఆర్టీజీఎస్ అధికారులను సంప్రదించాలని యాత్రికులకు సూచించారు.
ఫ్లాష్ ఫ్లడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచన
నేపాల్‌లో మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. స్థానిక పరిస్థితులను గమనిస్తూ, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న ఇతర తెలుగు యాత్రికుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసుల ఆచూకీ, క్షేమ సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కేంద్రంతో ఏపీ భవన్ నిరంతర సమన్వయం
నేపాల్‌లో పరిస్థితిపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర అధికారుల నుంచి అందుతున్న సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు చేరవేస్తూ సమన్వయం చేస్తున్నారు.
వరదల పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు యాత్రికుల భద్రతపై నిఘా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన సమయంలో తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్ర యంత్రాంగం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
Tags
Be the first to react