భోజనం చేసిన తర్వాత అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు చాలా మందికి తరచూ ఎదురవుతుంటాయి. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత ఛాతీ మండటం, లోపల గ్యాస్ నిల్వ ఉండడం వంటి అసౌకర్యం ఎక్కువగా అనిపిస్తుంది. వీటిని తగ్గించేందుకు చాలామంది మందులు ఆహార నియమాలు పాటిస్తారు. అయితే భారతీయ వంటింట్లో ఉండే వాము వంటి సహజమైన పదార్థం ఈ సమస్యలకు మంచి పరిష్కారంగా పనిచేస్తుందని సంప్రదాయ వైద్యం మరియు ఆధునిక పరిశోధన రెండూ సూచిస్తున్నాయి. వాములో ఉండే థైమాల్ అనే జైవిక రసాయనం జీర్ణక్రియను మెరుగుపరచి అజీర్తి, గ్యాస్, ఉబ్బరాన్ని నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
వాము గింజలు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా కడుపులో అధిక ఆమ్లం పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. ఒక టీ స్పూన్ వామును నమలడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా ఆమ్లం, వాయువు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. వాము గింజలు అజీర్తి వలె కనిపించే కడుపు నొప్పి, వాయు నిల్వ, భారంగా అనిపించడం వంటి అసౌకర్యాలను సైతం తగ్గిస్తాయి. అదనంగా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల కడుపులోని హానికర బ్యాక్టీరియాను నియంత్రించి కడుపు పొరల్లో ఉన్న వాపును తగ్గించడం కూడా వాము చేసే ముఖ్యమైన పని.
రాత్రి భోజనం తర్వాత ఉబ్బరం మరియు గ్యాస్ ఎక్కువయ్యే వారికి వాము మంచి ఉపశమనం ఇస్తుంది. స్వల్ప ఉప్పుతో కలిపి ఒక చెంచా వాము నమలడం వల్ల కార్మినేటివ్ ప్రభావం కలిగి పేగుల్లోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది వాయువు బయటకు రానివ్వడం ద్వారా అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అలాగే వాము టీ తయారు చేసుకొని తీసుకున్నా జీర్ణక్రియ సులభమవుతుంది. వాము గింజలు క్రమం తప్పకుండా తీసుకునే వారు గట్ మైక్రోబియోమ్ మెరుగుపడటం వల్ల అజీర్తి, వాయువు, వికారం వంటి సమస్యలు తగ్గినట్లు అనుభవిస్తారు.
వాము ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ వరకే పరిమితం కావు. మెటబాలిజమ్ పెరగడానికి, ఆకలి సరిగ్గా రావడానికి, కొంతమేర బరువు నియంత్రణకు కూడా ఇవి సహాయపడతాయి. అదేవిధంగా ఇవి సహజ యాంటీమైక్రోబియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల గట్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే గర్భిణీలు మరియు థైరాయిడ్ సమస్యలున్న వారు వాము తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. సాధారణంగా వామును గోరువెచ్చని నీటిలో నానబెట్టి తాగడం, నేరుగా నమలడం, టీగా తాగడం వంటి పద్ధతుల్లో ఉపయోగించవచ్చు. సరైన సమయంలో మరియు సరైన పరిమాణంలో తీసుకుంటే వాము ఒక సహజ జీర్ణ మందులా పనిచేస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవడం మంచిది.