తిరుపతిలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తుడా పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుండటం, నగర జనాభా వేగంగా పెరుగుతుండటం వల్ల సమగ్ర రవాణా ప్రణాళిక అవసరమైంది. ఈ నేపథ్యంలో నగరానికి వెలుపలుగా, సుమారు 90 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి స్వయంగా అధికారులతో కలిసి రోడ్డుకు సంబంధించిన ప్రాథమిక సర్వే నిర్వహించారు. నగర భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి ట్రాఫిక్ నిర్వహణను సులభతరం చేయడానికి ఈ రింగ్ రోడ్ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ రోడ్డు నగరం చుట్టూ గ్రామీణ, చంద్రగిరి, రేణిగుంట వంటి ముఖ్య మండలాలను కలుపుతూ సాగనుంది.
గతంలో వైకుంఠమాల పేరుతో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కొన్ని కారణాల వల్ల ముందుకు సాగలేదు. ప్రస్తుతం అదే ప్రతిపాదనను తుడా మళ్లీ పరిశీలిస్తూ, ప్రభుత్వ భూములను ఎక్కువగా వినియోగించి భూసేకరణ ఖర్చులను తగ్గించే కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు, నిర్మాణ వేగం కూడా పెరిగే అవకాశం ఉంది.
ప్లాన్ అమల్లోకి వచ్చిన తర్వాత తిరుపతి గ్రామీణ, చంద్రగిరి, రామచంద్రాపురం, రేణిగుంట, వడమాలపేట మండలాలు ఈ రింగ్ రోడ్డుతో అనుసంధానమవుతాయి. వడమాలపేట నుంచి నారావారిపల్లి, కల్యాణి డ్యామ్, జూపార్క్, అలిపిరి, కరకంబాడి ప్రాంతాల మీదుగా రింగ్ రోడ్ వెళ్లేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మేరకు పూర్తి ఖరారు వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. నగరంలోకి ప్రవేశించే మరియు నగరం విడిచి వెళ్లే వాహనాలు నేరుగా ఔటర్ రింగ్ రోడ్డును వినియోగించుకోవచ్చు. దీనివల్ల తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభమవుతుందని, నగర చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థికాభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.