ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ అప్పుల నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అధిక వడ్డీల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని ఆయన స్పష్టం చేశారు. రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే సంవత్సరానికి రూ.7 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని వివరించారు. సచివాలయంలో మంత్రులు, హెచ్‌వోడీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేంద్ర నిధులను సమయానికి వినియోగించాలనీ, వివరాలు వెంటనే సమర్పించాలని సూచించారు.
ఫైళ్లను పెండింగులో పెట్టకుండా, పని తీరు మెరుగుపరుచుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వివిధ శాఖలు తమ పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చాయి. ముఖ్యంగా కేంద్ర నిధులను వినియోగించడంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారదర్శకత, వేగంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన మరో సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకూ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది గతేడాదితో పోలిస్తే 32 శాతం అధికమని వివరించారు. మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతోందని చెప్పారు. రైతులకు 7.89 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రూ.4,085 కోట్ల చెల్లింపులు రైతులకు జమ చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా ప్రభుత్వం 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల మంత్రి మనోహర్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేసి, ధాన్యం కొనుగోళ్లను వేగంగా నిర్వహించడం రైతులకు ఉపశమనం కలిగించే విషయం అని సీఎం అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీల భారం తగ్గించడం, ధాన్యం సేకరణ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.