- హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ డాల్ఫిన్లను వాడుతుందన్న ప్రచారం..
- Gulf: తమ వద్ద 'కామికేజ్ డాల్ఫిన్లు' ఉన్నాయో లేదో చెప్పలేనంటూ వ్యాఖ్య..
Iran: హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ మైన్లతో అంతరాయం కలిగించవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, అమెరికా నౌకాదళాన్ని ఢీకొనేందుకు టెహ్రాన్ "కామికేజ్ డాల్ఫిన్లను" రంగంలోకి దించుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా పెను చర్చకు దారితీశాయి. ఈ ఊహాగానాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పందిస్తూ, ఇరాన్ వద్ద అటువంటి ఆత్మాహుతి డాల్ఫిన్ సైన్యం ఏదీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఇదే తరహా వ్యవస్థ అమెరికా వద్ద ఉందా అనే ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. తమ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయో లేదో ధ్రువీకరించలేనని, అలా అని ఖండించలేనని వ్యాఖ్యానించిన ఆయన, ఇరాన్ వద్ద మాత్రం అవి లేవని కచ్చితంగా చెప్పగలనని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 30న వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఒక కథనం ఈ చర్చకు మూలకారణం కాగా, అమెరికా యుద్ధ నౌకలపై దాడికి ఇరాన్ "మైన్లు మోసుకెళ్లే డాల్ఫిన్లను" వినియోగించే అవకాశం ఉందని ఆ పత్రిక పేర్కొంది.
వాస్తవానికి అమెరికా నౌకాదళం దశాబ్దాలుగా సైనిక అవసరాల కోసం "మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్" ద్వారా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. బాటిల్‌నోస్ డాల్ఫిన్లు, కాలిఫోర్నియా సీ లయన్‌లను వినియోగిస్తున్నప్పటికీ, ఇవి ఆత్మాహుతి దాడులు చేసే రకం కాదని అమెరికా స్పష్టం చేస్తోంది. యూఎస్ నేవీ శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు కేవలం సముద్ర గర్భంలో దాగి ఉన్న మైన్లను గుర్తించి వాటి లొకేషన్‌ను మార్క్ చేయడానికి మాత్రమే పరిమితమవుతాయని, అవి ప్రాణత్యాగం చేసే కామికేజ్ రకాలు కావని సమాచారం. డాల్ఫిన్ల సహజ సిద్ధమైన సోనార్ వ్యవస్థ ముందు మరే ఇతర టెక్నాలజీ లేదా నీటి అడుగున పనిచేసే డ్రోన్‌లు సరిపోవని సదరు ప్రోగ్రామ్ వెబ్‌సైట్ గర్వంగా చెబుతోంది.
గత చరిత్రను పరిశీలిస్తే రష్యా తన నౌకాశ్రయాల భద్రతకు డాల్ఫిన్లను వాడగా, 2000 సంవత్సరంలో ఇరాన్ కూడా కొన్ని డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అవి వయసు పైబడటం వల్ల క్రియాశీలకంగా ఉండే అవకాశం లేదని, ప్రస్తుతం టెహ్రాన్ వద్ద అటువంటి చురుకైన ప్రోగ్రామ్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియలో అమెరికా తన డాల్ఫిన్లను ఉపయోగించడం లేదని సీఎన్ఎన్ కథనం వెల్లడించింది.