అర్జెంటీనా ఫుట్‌బాల్ లియోనెల్ మెస్సీ భారత నేలపై అడుగుపెట్టడంతోనే ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆయన కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంటారని ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ, నగరం నిద్రపోలేదు. వేలాది అభిమానులు ముందుగానే గేట్ల వద్ద క్యాంపులు వేసి, జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ తమ ఫుట్‌బాల్ క్రీడాకారుడును చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూశారు.
మెస్సీ విమానం ల్యాండ్ అయిన క్షణమే గేట్ 4 వద్ద హడావుడి మొదలైంది. మొబైల్ ఫోన్లు వెలిగిపోయాయి, డ్రమ్స్ మోగాయి, అభిమానులు ఒక గేట్ నుంచి మరో గేట్‌కు పరుగులు తీస్తూ ఒక చూపు దొరికినా చాలు అని తహతహలాడారు. భారీ భద్రత మధ్య మెస్సీని వెంటనే VIP మార్గం ద్వారా బయటకు తీసుకెళ్లగా, ఆయన హోటల్ అయిన హయత్ రీజెన్సీకి పంపించడం జరిగినది.
GOAT India Tour 2025 పేరుతో జరుగుతున్న మూడు రోజుల ఇండియా పర్యటనలో మెస్సీ నాలుగు నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కోల్‌కతాలో మొదటి రోజు కార్యక్రమాల కోసం ఇప్పటికే నగరం మొత్తం వేడుకల మాదిరిగా అలంకరించబడింది. శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 వరకు VIP మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు. దీనిలో కొందరు ఎంపికైన అభిమానులు, స్పాన్సర్స్, ప్రముఖులు మెస్సీని కలిసే అవకాశం పొందనున్నారు. అతనిని చూసిన ప్రతిసారి అభిమానులు చేసే హర్షధ్వనులు కోల్‌కతా ఆతిథ్యాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తుచేశాయి.
తదుపరి 10.30 నుంచి 11.15 వరకు 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆయన వర్చువల్‌గా ఆవిష్కరించనున్నారు. ఇది అభిమానులకు ప్రత్యేక క్షణంగా నిలవనుంది. అనంతరం యూబా భారతి క్రీడా ప్రాంగణానికి వెళ్లే కార్యక్రమం ఉంది. అక్కడ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నారు. 12 గంటల నుండి 12.30 వరకు నిర్వహించే సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, గౌరవ కార్యక్రమంలో పాల్గొని మెస్సీ కోల్‌కతా అభిమానులను మరింత ఉత్సాహపరచనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఆయన హైదరాబాద్ కు బయలుదేరతారు. అక్కడ రాజీవ్ గాంధీ స్టేడియంలో చిన్న ఎగ్జిబిషన్ మ్యాచ్, ఒక ఫుట్‌బాల్ క్లినిక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే కార్యక్రమం ఉంటాయి. పర్యటనలో భాగంగా తరువాత ఆయన ముంబై, ఢిల్లీ నగరాలకు కూడా వెళతారు. ముంబైలో వాంఖడే స్టేడియంలో ప్రత్యేక ఈవెంట్, సుయారెజ్, డి పాల్‌తో కలిసి 45 నిమిషాల ఫిలాంత్రపిక్ ఫ్యాషన్ షో కూడా ఉందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ భేటీ కావడం ఈ టూర్‌కు మరో ప్రధాన ఆకర్షణ.
మెస్సీ భారత్‌లో అడుగు పెట్టిన ప్రతిసారి, క్రీడాభిమానుల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉప్పొంగుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. జెండాలు ఊపుతున్న చిన్నారులు, కేవలం ఒక చూపు కోసం గంటల పాటు ఎదురు చూసిన అభిమానులు ఈ ప్రతీ దృశ్యం మెస్సీ ప్రభావం ఎంత గొప్పదో మరోసారి సాక్ష్యంగా నిలిచింది. ఆయన పర్యటన మొదటి రోజే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. GOAT అనే బిరుదుకు న్యాయం చేసేలా మెస్సీ ప్రవేశం భారత అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి.