శ్రీకాకుళం జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. పొందూరు ఖద్దరుకు ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్) లభించింది. వాణిజ్య పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఈ మేరకు అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ గుర్తింపుతో పొందూరు ఖద్దరు ప్రత్యేకత దేశవ్యాప్తంగా అధికారికంగా గుర్తింపు పొందింది. దీంతో శ్రీకాకుళం ప్రజలు, ముఖ్యంగా నేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రత్యేక నాణ్యత, సంప్రదాయం ఉంటుంది. అలాంటి ఉత్పత్తులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్–1999’ను అమలు చేస్తోంది. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక భౌగోళిక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు GI ట్యాగ్ ఇస్తారు. ఆ జాబితాలోకి ఇప్పుడు పొందూరు ఖద్దరు కూడా చేరడం విశేషం.
పొందూరు ఖాదీకి GI ట్యాగ్ రావడంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక పాత్ర పోషించారు. ఎంపీగా ఉన్న సమయంలోనే, 2020 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి GI గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి అయిన తర్వాత ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, నిరంతర ప్రయత్నాలతో పొందూరు ఖాదీకి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
ఇప్పటికే బాస్మతి బియ్యం, డార్జిలింగ్ టీ, కాంచీపురం పట్టుచీరలు, పోచంపల్లి చీరలు, మైసూరు పట్టు, కొండపల్లి–నిర్మల్ బొమ్మలు వంటి వాటికి GI ట్యాగ్ ఉంది. ఇప్పుడు అదే సరసన పొందూరు ఖాదీ చేరడం శ్రీకాకుళానికి గర్వకారణంగా మారింది. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ ఖద్దరు, మహాత్మా గాంధీకి ఎంతో ప్రియమైన వస్త్రంగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
GI ట్యాగ్‌పై స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు కాదని, శ్రీకాకుళం నేత కార్మికుల తరతరాల వారసత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో నేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడుతుందని, పొందూరు ఖాదీకి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గౌరవాన్ని సంప్రదాయాన్ని కాపాడిన నేత కార్మికులకు అంకితం చేశారు.