ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ చలానాలకు సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. ఆయన వివరాల ప్రకారం, 2024 సంవత్సరంలో ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 44,24,135 ఈ-చలానాలు జారీ అయ్యాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.102.13 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
అయితే ఇదే సమయంలో ఏపీలో ఇంకా భారీగా చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2024 సంవత్సరానికి సంబంధించిన రూ.126.51 కోట్ల విలువైన ట్రాఫిక్ చలానాలు ఇంకా వసూలు కావాల్సి ఉందని స్పష్టం చేశారు. పెండింగ్ చలానాలు పెరగడం రోడ్డు భద్రతపై ప్రభావం చూపుతోందని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా చూస్తే, 2024లో మొత్తం 8.18 కోట్ల ట్రాఫిక్ చలానాలు జారీ చేసినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. వీటి ద్వారా కేంద్రానికి రూ.3,834 కోట్లు వసూలయ్యాయని, ఇంకా రూ.9,097 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ఈ జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. యూపీలో 1.53 కోట్ల చలానాలు జారీ కాగా, దిల్లీ రెండో స్థానంలో ఉండి 78.19 లక్షల చలానాలు నమోదయ్యాయి.
ఇదే సమయంలో ఏపీకి సంబంధించిన ఇతర అభివృద్ధి అంశాలపై కూడా కేంద్ర మంత్రి స్పందించారు. అనంతపురం, విశాఖపట్నంలలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. అనంతపురంలో భూమి అందుబాటులో ఉందని, డీపీఆర్ కూడా పూర్తయ్యిందని చెప్పారు. విశాఖపట్నంలో లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు ఫీజిబిలిటీ రిపోర్ట్, డీపీఆర్ కోసం కన్సల్టెంట్ నియామకం పూర్తైనట్లు వివరించారు.
మరోవైపు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు కేంద్ర రవాణా శాఖ కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం, ఒక వాహనంపై ఐదుకంటే ఎక్కువ చలానాలు పెండింగ్‌లో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహనం సీజ్ చేసేలా నిబంధనలు ప్రతిపాదించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, ప్రజలు ట్రాఫిక్ రూల్స్‌ను మరింత జాగ్రత్తగా పాటిస్తారని అధికారులు భావిస్తున్నారు.