ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీ కోసం మొత్తం రూ.830.04 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి సమయానికి అందించేందుకు మార్గం సుగమమైంది.
ఈ విద్యార్థి మిత్ర కిట్లలో నోట్‌బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీలు, స్కూల్ బ్యాగ్, షూలు, బెల్ట్‌తో పాటు మూడు జతల యూనిఫాం క్లాత్‌లు ఉంటాయి. విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన అన్ని ముఖ్యమైన వస్తువులను ఒకే కిట్‌లో అందించడమే ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు చదువుపై మరింత దృష్టి పెట్టే అవకాశం కలుగుతుంది.
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.157.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.672.84 కోట్లు నిధులు కేటాయించింది. ఈ నిధులను కిట్ల సేకరణ, నిల్వ, పంపిణీ కోసం వినియోగించనున్నారు. టెండర్ల ద్వారా నాణ్యమైన వస్తువులు సరఫరా చేసే అర్హులైన సంస్థలను ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కిట్ల సేకరణ, పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, కట్టుదిట్టమైన టైం లైన్‌తో సాగనుంది. డిసెంబరు తొలి వారంలో టెండర్ డాక్యుమెంట్ల తయారీ, రెండో వారంలో టెండర్ల ప్రకటన, జనవరి చివరి వారంలో టెండర్ల ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరిలో మూడు దశల్లో నమూనాల నాణ్యత పరిశీలన చేపట్టనున్నారు.
మే నెలలో జిల్లా, మండల స్టాక్ పాయింట్లకు సామగ్రి తరలింపు, నాలుగో వారంలో కిట్ల తయారీ పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ తొలి వారంలో పాఠశాలలకు సరఫరా చేసి, జూన్ 12న విద్యార్థులకు కిట్లు అందించాలన్నది లక్ష్యం. ఈ ప్రక్రియ మొత్తం విద్యార్థుల మేలు కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తూ, ప్రతి వస్తువు నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపింది.