ఈ రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో తప్పనిసరి పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, రేషన్, పెన్షన్ వంటి సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి అయింది. అయితే వృద్ధులు, మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితులు, దివ్యాంగులు ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ‘ఇంటి వద్దే ఆధార్ సేవలు’ అందించే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆధార్ అప్‌డేట్ కోసం ఇబ్బంది పడుతున్న వేలాది మందికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ సేవ ఎంత ఉపయోగకరమో చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు మంచానికే పరిమితమై ఉండగా, ఆమె వేలిముద్రలను అప్‌డేట్ చేసేందుకు UIDAI సిబ్బంది నేరుగా ఆమె ఇంటికే వెళ్లి సేవలు అందించారు. అలాగే విజయవాడలో మతిస్థిమితం లేని ఓ యువకుడి ఆధార్ అప్‌డేట్ కోసం కూడా అధికారులు ఇంటికే వెళ్లి ప్రక్రియను పూర్తి చేశారు. ఇలాంటి ఉదాహరణలు ‘ఇంటి వద్ద ఆధార్’ సేవ ఎంత అవసరమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సమాజంలోని బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న మానవతా దృక్పథానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ ‘ఇంటి వద్ద ఆధార్’ సేవలు అందరికీ కాకుండా, ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికే పరిమితం చేస్తారు. ఇందులో వృద్ధులు, మంచానికే పరిమితమైన వ్యక్తులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు అర్హులు. ఆధార్ కేంద్రానికి వెళ్లడం అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నవారే ఈ సేవలను పొందగలరు. దీనివల్ల నిజంగా అవసరం ఉన్నవారికే సేవలు అందేలా UIDAI మార్గదర్శకాలు రూపొందించింది. ఈ విధానం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.
ఇంటి వద్దే ఆధార్ సేవలు పొందాలంటే ముందుగా కుటుంబ సభ్యులు సంబంధిత ప్రాంతీయ UIDAI కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వయసు, ఆధార్ అప్‌డేట్ అవసరం ఎందుకు అనే వివరాలతో ఒక లేఖ సమర్పించాలి. దీనికి తోడు ఆ వ్యక్తి ఫోటో, వైద్యులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్, మరో గుర్తింపు కార్డు జిరాక్స్‌ను జతచేయాలి. ఈ డాక్యుమెంట్లను UIDAI సిబ్బంది పరిశీలించిన తర్వాత సుమారు 7 రోజుల్లో ఇంటికే వచ్చి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ సేవకు దూరంతో సంబంధం లేకుండా సుమారు రూ.700 వరకు ఫీజు వసూలు చేస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఉన్న UIDAI ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.