రాబోయే వారం రోజుల్లో విశాఖపట్నం అందాలను ఆస్వాదించేందుకు వెళ్లే పర్యాటకులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే విశాఖ తీరంలో తొమ్మిది రోజుల పాటు సాగనున్న టూరిస్టుల పండుగకు ముహూర్తం ఖరారైంది. జనవరి 23 నుంచి 31 వరకు ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో ఘనంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫుడ్, కల్చరల్ ఈవెంట్స్‌తో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.
దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బీచ్ ఫెస్టివల్‌ను డిజైన్ చేస్తున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్థానిక వంటకాలతో కూడిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ తీర ప్రాంతంలో పర్యాటకుల సందడి పెరిగేలా ప్రతి రోజు ప్రత్యేక ఆకర్షణలతో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవం ద్వారా విశాఖను ఒక ప్రముఖ టూరిజం డెస్టినేషన్‌గా మరింత బలంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
శుక్రవారం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తొలి సమీక్ష సమావేశంలో ‘విశాఖ ఉత్సవ్ – బీచ్ ఫెస్టివల్’ పోస్టర్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు.
విశాఖ ఉత్సవ్‌ను ఒక భారీ ఈవెంట్‌గా నిర్వహించి రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విశాఖ ఉత్సవ్ నిర్వహణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసే సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ బీచ్ ఫెస్టివల్‌తో విశాఖలో పర్యాటక రద్దీ గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.