ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న పింఛన్ దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ మంజూరులో కలెక్టర్లకు తగిన విచక్షణాధికారం లేకపోవడం వల్ల నిజంగా అర్హులైన వారు న్యాయం పొందలేకపోతున్నారన్న అంశం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ఎంతోకాలంగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద ఊరట లభించనుంది.
ఈ కొత్తగా మంజూరు చేయనున్న 200 పింఛన్లు ముఖ్యంగా అత్యవసర అవసరాల్లో ఉన్న వర్గాలకు కేటాయించనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు వంటి అత్యంత అర్హులైన వారికి ఈ పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పింఛన్ల మంజూరు విషయంలో ఇంతవరకు ఉన్న పరిమితులను తొలగిస్తూ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీని వల్ల స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పింఛన్ల కోసం పీజీఆర్‌ఎస్‌కు తరచూ వచ్చే బాధితులకు ఇకపై న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
కలెక్టర్ల సదస్సులో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పింఛన్ల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. తమకు తగిన అధికారాలు లేకపోవడంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ బాధితులు, సర్వం కోల్పోయి వచ్చిన వారికి తక్షణ సహాయం అందించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పింఛన్ల మంజూరుకు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కోరగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సానుకూలంగా స్పందించి ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సదస్సులో తిరుపతి జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ‘సంక్షేమ సంకల్పం’ కార్యక్రమం కింద సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పనలో మంచి మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ విధానాన్ని మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు యోగా శిక్షణ అందించేందుకు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు వివరించారు. అలాగే తిరుపతి జిల్లాకు భారీగా రూ.96 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని సీఎం పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు త్వరగా గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.