ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ప్రభుత్వ ఉద్యోగుల కోసం కర్మయోగి ఆవాస్ యోజన 2025 అనే ప్రత్యేక హౌసింగ్ పథకాన్ని ప్రకటించింది. ఢిల్లీలో పెరుగుతున్న ఇళ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ సేవల్లో ఉన్న ఉద్యోగులు తక్కువ ధరకు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ యూనివర్సిటీల ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
ఈ పథకం కింద మొత్తం 1,168 రెడీ-టు-మూవ్-ఇన్ ఫ్లాట్స్ ను DDA అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్లాట్స్ అన్నీ ఢిల్లీలోని నరేలా ప్రాంతం (Pocket 9, Sector A1 నుంచి A4 వరకు) లో ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఫ్లాట్స్ కావడంతో, కొనుగోలు చేసిన వెంటనే నివాసానికి ఉపయోగించుకోవచ్చు. ఫ్లాట్ల కేటాయింపు ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్ విధానంలో జరుగుతుంది.
ఈ హౌసింగ్ స్కీమ్‌లో 1BHK, 2BHK, 3BHK అనే మూడు రకాల ఫ్లాట్స్ ఉన్నాయి. 1BHK ఫ్లాట్ల విస్తీర్ణం సుమారు 61 చదరపు మీటర్లు కాగా, 2BHK ఫ్లాట్లు 126 నుంచి 141 చదరపు మీటర్ల వరకు ఉన్నాయి. అలాగే 3BHK ఫ్లాట్ల విస్తీర్ణం 163 నుంచి 183 చదరపు మీటర్ల వరకు ఉంటుంది. ప్రతి ఫ్లాట్‌కు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు.
ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ 25 శాతం డిస్కౌంట్. ఈ రాయితీ కారణంగా ఫ్లాట్ల ధరలు మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. 1BHK ఫ్లాట్ల ధరలు సుమారు రూ.34 లక్షల నుంచి, 2BHK ఫ్లాట్లు రూ.79.8 లక్షల నుంచి, 3BHK ఫ్లాట్లు రూ.1.15 కోట్ల నుంచి రూ.1.27 కోట్ల వరకు ఉంటాయని సమాచారం. ఢిల్లీలో ఇంత తక్కువ ధరకు ఇల్లు దక్కడం ప్రభుత్వ ఉద్యోగులకు అరుదైన అవకాశం అని చెప్పవచ్చు.
ఈ స్కీమ్‌కు సేవలో ఉన్నవారితో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులే. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నా కూడా ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పథకానికి రిజిస్ట్రేషన్లు 2025 డిసెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యాయి. ఫ్లాట్ బుకింగ్ ప్రక్రియ 2026 జనవరి 14 నుంచి మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్నవారు DDA అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.