ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడం, ఐటీ కంపెనీలు, పరిశ్రమలను తీసుకురావడం మాత్రమే కాకుండా… ఆయా రంగాలకు అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంపొందించే దిశగా పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘కౌశలం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించి నిరుద్యోగ యువత వివరాలను సేకరించింది. ఇప్పటికే లక్షలాది మంది యువత నుంచి డేటా సేకరించి, వారి అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా పరీక్షలు కూడా నిర్వహిస్తోంది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘కౌశలం’ అనే ఏఐ ఆధారిత పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా ప్రైవేటు సంస్థలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు (GCCs) అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను గుర్తించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని తెలిపారు. డేటా ఆధారంగా అర్హతలు ఉన్న యువతను షార్ట్‌లిస్ట్ చేసి, వారిని నేరుగా కంపెనీలకు అనుసంధానం చేయడమే ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 24.14 లక్షల మంది యువత నుంచి పూర్తి సమాచారం సేకరించి కౌశలం పోర్టల్‌లో నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. యువతలో డేటా అనలిటిక్స్, కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ వంటి అంశాలను పరిశీలించి, అర్హతల ఆధారంగా దాదాపు 2.5 లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు లభించడం విశేషం. ఇది దేశంలోనే ఒక వినూత్న ప్రయత్నమని అధికారులు చెబుతున్నారు. యువత నైపుణ్యాలను సరైన మార్గంలో ఉపయోగించుకుంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెద్ద ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాబోయే రోజుల్లో యువతకు మరింతగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబయి వంటి మెట్రో నగరాల్లోని ప్రముఖ కంపెనీలతో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే ‘కౌశలం’ పోర్టల్‌ను రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. విద్యార్థుల విద్యార్హతలు, నైపుణ్యాలను నేరుగా కంపెనీలకు చేరేలా చేయాలని భావిస్తోంది. రాబోయే మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కౌశలం ద్వారా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు కూడా కల్పించనుండగా… ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి.