OnePlus: మొబైల్ మార్కెట్ చరిత్రలోనే పెద్ద షాక్.. ఇండియాలో వన్‌ప్లస్ మొబైల్స్ ఇక కనిపించవా? బ్లూమ్‌బెర్గ్ నివేదికతో యూజర్లలో టెన్షన్!
OnePlus: ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితుల మధ్య వన్‌ప్లస్ భవిష్యత్‌పై మరోసారి చర్చ మొదలైంది. కంపెనీ కార్యకలాపాలపై గతంలోనూ పలు ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తాజా నివేదిక మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
- ముందుగా అమెరికా, యూరప్లో కార్యకలాపాలు నిలిపివేసే అవకాశం..
- Gadgets: అమ్మకాల మందగమనం, చిప్ ధరల పెరుగుదలే ప్రధాన కారణాలు..
OnePlus: భారత స్మార్ట్‌ఫోన్ ప్రియులకు, ముఖ్యంగా ప్రీమియం మొబైల్స్ వాడే వన్ప్లస్ (OnePlus) లవర్స్కు ఇది జీర్ణించుకోలేని వార్త. ‘నెవర్ సెటిల్’ అనే నినాదంతో గ్లోబల్ మొబైల్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన వన్ప్లస్ బ్రాండ్ భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. గ్లోబల్ మార్కెట్ల నుండి వన్ప్లస్ క్రమంగా నిష్క్రమించనుందనే వార్తలు గతంలోనే వినిపించినప్పటికీ, ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారత్ (India) నుండి కూడా ఈ బ్రాండ్ వైదొలగనుందనే తాజా నివేదికలు పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'బ్లూమ్బర్గ్' (Bloomberg) ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం, వన్ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యంలో భారీ పునర్వ్యవస్థీకరణ (Global Restructuring) దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే వన్ప్లస్ బ్రాండ్ కార్యకలాపాలను దశలవారీగా పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ముందుగా యూరప్.. 2027 నాటికి భారత్ నుంచి ప్యాకప్!
బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం ఒప్పో తన గ్లోబల్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేస్తోంది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం వన్ప్లస్ నిష్క్రమణ ఇలా సాగనుంది:
మొదటి దశ (అమెరికా, యూరప్): ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మొదటగా అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి వన్ప్లస్ దుకాణాన్ని సర్దేయనుంది.
రెండో దశ (భారత్ - 2027): అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వన్ప్లస్కు అతిపెద్ద యూజర్ బేస్ ఉన్న భారత్లో కూడా 2027 నాటికి ఈ బ్రాండ్ను పూర్తిగా నిలిపివేయాలని ఒప్పో భావిస్తోంది. ఇప్పటివరకు కేవలం పాశ్చాత్య దేశాలకే పరిమితం అనుకున్న ఈ నిర్ణయం పరిధిలోకి భారత్ను కూడా చేర్చడం ఇదే తొలిసారి.
ఈ సంచలన నిర్ణయానికి దారితీసిన ప్రధాన కారణాలు ఇవే!
ఒప్పో లాంటి దిగ్గజ సంస్థ ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి వెనుక బలమైన మార్కెట్ ఒత్తిళ్లు, అంతర్జాతీయ రాజకీయ సవాళ్లు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.
పెరిగిన ఉత్పత్తి ఖర్చులు: స్మార్ట్ఫోన్లలో అత్యంత కీలకమైన డీఆర్ఏఎమ్ (DRAM), ఫ్లాష్ మెమరీ చిప్ల ధరలు అంతర్జాతీయంగా భారీగా పెరగడంతో మొబైల్ తయారీ వ్యయం భారంగా మారింది.
యాపిల్తో న్యాయ వివాదం: అమెరికా మార్కెట్లో యాపిల్ (Apple) సంస్థతో కొనసాగుతున్న సుదీర్ఘ పేటెంట్ మరియు ఇతర న్యాయపరమైన వివాదాలు కూడా వన్ప్లస్కు పెద్ద ప్రతిబంధకంగా మారాయి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: అమెరికా-చైనా దేశాల మధ్య మారుతున్న రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు చైనా బ్రాండ్ అయిన ఒప్పో శ్రేణిని ఇరుకున పెట్టాయి.
లీడర్షిప్ మార్పులు: ఈ ఏడాది ప్రారంభంలో వన్ప్లస్ ఇండియా సీఈఓ బాధ్యతల నుంచి రాబిన్ లియూ తప్పుకోవడం, ఆ తర్వాత స్థానిక యాజమాన్య నిర్మాణంలో చోటుచేసుకున్న నిశ్శబ్ద మార్పులు కూడా ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
రియల్మీ కూడా అవుట్.. ఒప్పో కొత్త వ్యూహం!
కేవలం వన్ప్లస్ మాత్రమే కాదు, ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఒప్పో కింద పనిచేసే మరో సబ్-బ్రాండ్ 'రియల్మీ' (Realme) పై కూడా గట్టి దెబ్బ పడనుంది. రియల్మీ బ్రాండ్ను చైనా మార్కెట్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఒప్పో నిర్ణయించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే, ఒప్పో తన సొంత బ్రాండ్ (Oppo) పైనే ఇకపై పూర్తి దృష్టి పెట్టనుంది. స్వదేశమైన చైనాలో పట్టు నిలుపుకోవడంతో పాటు, మధ్య యూరప్లో ఒప్పో బ్రాండ్ను మరింత బలోపేతం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వంటి నార్డిక్ దేశాలలో మాత్రం రియల్మీ బ్రాండ్ ఉనికిని కొనసాగించనున్నారు.
మార్కెట్లో నిలదొక్కుకునేందుకు బ్రాండ్లను విలీనం చేయడం లేదా మూసివేయడం టెక్ పరిశ్రమలో సహజమే అయినప్పటికీ.. భారత్లో ఓ వెలుగు వెలిగిన ప్రీమియం బ్రాండ్ వన్ప్లస్ నిష్క్రమించనుందనే వార్త మాత్రం సాధారణ కస్టమర్ల నుంచి టెక్ ప్రియుల వరకు అందరినీ తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
Tags
Be the first to react