Vikram1 Rocket: భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. 3D ప్రింటెడ్ ఇంజిన్.. విక్రమ్-1 ప్రయోగం 100% సక్సెస్!
Vikram1 Rocket: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace) రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది.
- భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతం...
Vikram1 Rocket: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో శనివారం ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) రూపొందించిన ‘విక్రమ్-1’ (Vikram-1) రాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (SHAR) నుంచి శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక విజయంతో, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇస్రో (ISRO) కార్యక్రమాలతో పాటు భారత ప్రైవేటు రంగం కూడా స్వతంత్రంగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపగలదని ప్రపంచ దేశాలకు చాటిచెప్పినట్లయింది.
సాంకేతిక లోపం అధిగమించి.. 35 నిమిషాల ఆలస్యంగా ప్రయోగం..
నిజానికి ఈ రాకెట్ ప్రయోగం శనివారం ఉదయం 11:30 గంటలకే జరగాల్సి ఉంది. అయితే, కౌంట్‌డౌన్ ముగిసే సమయానికి ఇంధన ప్రక్రియలో (Fuel System) ఒక చిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రంగంలోకి దిగిన ఇస్రో మరియు స్కైరూట్ శాస్త్రవేత్తల బృందం లోపాన్ని నిమిషాల వ్యవధిలో గుర్తించి సరిచేసింది. దీంతో నిర్ణీత సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్నం 12:05 గంటలకు రాకెట్ సగర్వంగా నింగికి ప్రయాణమైంది.
రాకెట్‌లో ప్రధాని మోదీ ‘వందేమాతరం’ సందేశం.. ప్రత్యేక పేలోడ్స్ ఇవే!
స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ (Mission Aagaman) అని పేరు పెట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం అధికారికంగా ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పేరును ఖరారు చేశారు. ఈ రాకెట్ పలు వినూత్నమైన మరియు ప్రత్యేకమైన పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది:
ప్రధాని మోదీ చేతిరాత పోస్ట్‌కార్డు: స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వహస్తాలతో ‘వందేమాతరం’ అని రాసి పంపిన ఒక ప్రత్యేక పోస్ట్‌కార్డును ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు.
మహానుభావుల సూక్ష్మరూపాలు:కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన ‘కాస్మిక్ బ్లూమ్’ ఆర్ట్‌వర్క్‌తో పాటు విక్రమ్-1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని పంపారు. దీనిపై భారతదేశ గర్వకారణాలైన సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, డా. ఏపీజే అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల సూక్ష్మ చిత్రాలను అద్భుతంగా చెక్కారు.
సైంటిస్టుల బెస్ట్ విషెస్: ఈ మిషన్ విజయవంతం కావాలని కాంక్షిస్తూ స్కైరూట్ బృందంతో పాటు ఇస్రో మాజీ ఛైర్మన్లు, సీనియర్ శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్‌కార్డులను ఒక ప్రత్యేక బాక్సులో భద్రపరిచి నింగిలోకి పంపారు.
సాంకేతిక ఉపగ్రహాలు:గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్‌డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ పేలోడ్‌లతో పాటు స్కైరూట్‌కు చెందిన సొంత పేలోడ్ ‘స్కోప్’ (SCOPE)ను కక్ష్యలో ప్రవేశపెట్టారు.
3D ప్రింటెడ్ ఇంజిన్.. 7 అంతస్తుల విక్రమ్-1 ప్రత్యేకతలు..
సుమారు ఏడంతస్తుల భవనం ఎత్తులో ఉండే ఈ విక్రమ్-1 రాకెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైంది.
నిర్మాణం: ఈ రాకెట్ బాడీని పూర్తిగా తేలికపాటి, అత్యంత బలమైన కార్బన్ కాంపోజిట్ మెటీరియల్‌తో రూపొందించారు.
ఇంజిన్ టెక్నాలజీ:దేశీయంగా సరికొత్తగా అభివృద్ధి చేసిన 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లు, ఘన ఇంధన (Solid Fuel) బూస్టర్లతో ఈ రాకెట్ పనిచేస్తుంది.
సామర్థ్యం: ఇది సుమారు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను (Small Satellites) భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉండే లో-ఎర్త్ ఆర్బిట్ (LEO)లో ప్రవేశపెట్టగలదు.
గతంలో 2022లో 'విక్రమ్-ఎస్' అనే సబ్-ఆర్బిటాల్ రాకెట్‌ను ప్రయోగించి రికార్డు సృష్టించిన స్కైరూట్.. ఇప్పుడు విక్రమ్-1 ద్వారా పూర్తిస్థాయి ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే (Orbital Launch) తొలి దేశీయ ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం ద్వారా రాకెట్‌లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్ మరియు నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షించి గ్లోబల్ కమర్షియల్ మార్కెట్ కోసం తదుపరి ప్రయోగాలను మరింత సులభతరం చేయనున్నారు.
కుమారుడితో కలిసి వీక్షించిన ఏపీ మంత్రి నారా లోకేశ్..
భారత అంతరిక్ష రంగానికి మైలురాయిగా నిలిచిన ఈ అద్భుత ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యక్షంగా వీక్షించారు. తన కుమారుడు దేవాన్శ్‌తో కలిసి శ్రీహరికోట (SHAR)కు వెళ్లిన లోకేశ్.. ఇస్రో వ్యూయింగ్ గ్యాలరీ నుంచి 'విక్రమ్-1' నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యాలను చూసి శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్లు, సీనియర్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొని స్కైరూట్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Tags
Be the first to react