కర్ణాటకలో జీఎస్టీ నోటీసులపై చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. కొన్ని బేకరీలు, షాపుల్లో టీ, కాఫీ, పాల అమ్మకాలు నిలిపివేశారు. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే అందుబాటులో ఉంచారు. చాలా మంది వ్యాపారులు యూపీఐ పేమెంట్లను నిలిపేసి కేవలం నగదు లావాదేవీలకే పరిమితమయ్యారు.
జీఎస్టీ శాఖ తాము లక్ష్యంగా మారామని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నోటీసులు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. చిరు వ్యాపారుల ప్రతినిధులతో చర్చించేందుకు ఆయన మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసంలో భేటీ కావనున్నారని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, 2021 నుంచి 2024 మధ్యకాలంలో యూపీఐ, డిజిటల్ చెల్లింపుల ఆధారంగా జీఎస్టీ శాఖ ఈ డ్రైవ్ చేపట్టింది. రూ.20 లక్షలు (సేవలు), రూ.40 లక్షలు (వస్తువులు) మించిన ఆన్‌లైన్ లావాదేవీలను ఆధారంగా చేసుకుని వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తోంది.