ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా మారినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పైగా గడిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పలుమార్లు హెచ్చరించినా కొందరు మంత్రుల పని తీరు మెరుగు పడకపోవడం, మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా ఆగస్టు 8 నుంచి 15 మధ్య మంత్రివర్గంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. ఈ మార్పుల్లో 6 నుంచి 8 మంది వరకు మంత్రుల్ని తప్పించే అవకాశం ఉంది. కొన్ని శాఖలు మారనున్నాయి. జనసేన నుంచి నాగబాబు, కొణతాల రామకృష్ణ పేర్లు చర్చలో ఉన్నాయని సమాచారం.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును మంత్రిగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయన స్థానంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ దక్కనుందని జోరుగా ప్రచారం సాగుతుంది. ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు మంత్రులను మార్చే యోచనలో ఉన్న ప్రభుత్వం, వారి స్థానాల్లో పల్లా శ్రీనివాస్, కళా వెంకటరావు లాంటి నేతలకు అవకాశం ఇవ్వబోతున్నట్లు చర్చ సాగుతోంది. అలాగే, నెల్లూరు, గోదావరి జిల్లాల నుంచి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. బీజేపీ కూడా తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ, సామాజిక – ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని తుది ప్రక్షాళన ఏర్పాటవనుంది.
ఇక ఈ నిర్ణయాలన్నింటి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ పరిపాలన సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిపక్వత చూపించేలా, ప్రాంతీయ సమతుల్యతతో పాటు ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించేలా కొత్త మంత్రుల ఎంపికపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మార్పులు కూటమిలోని పార్టీల వ్యూహాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.