విజయవాడలో జరిగిన "ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు"లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తాను కలగనుకున్న విజయాల గురించి వివరించారు. ఎడారి ప్రాంతమైన దుబాయ్‌ను స్వర్గధామంగా మార్చిన తీరు విశేషంగా అభినందనీయమని పేర్కొన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్న దేశాలు మాత్రమే అభివృద్ధి సాధించగలవని, అందుకు నూతన ఆలోచనలే ఆధారం అని స్పష్టం చేశారు.
యూఏఈతో భారత్‌కు ఉన్న బంధాన్ని ఆయన ప్రస్తావించారు. యూఏఈ జనాభాలో 40 శాతం మంది భారతీయులే ఉండటం సంతోషకర విషయమని, భారత్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండడం గర్వకారణమన్నారు. తన ముఖ్యమంత్రిగా తొలి కాలంలో రూపొందించిన "విజన్ 2020" ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్) వంటి కొత్త ప్రణాళికలను అమలు చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. ఆగస్టు 15 నాటికి అన్నీ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ నిర్మాణమే తన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, లులు మాల్ సంస్థతో సంబంధాలు పెంచేందుకు దావోస్‌లో ప్రతినిధులను పలుమార్లు కలిసిన విషయాన్ని వెల్లడిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించారు.