ఎంతోమంది ఇష్టంగా తినే ముల్బాగల్ దోస.. సులభంగా తయారు చేసుకోండిలా!

Mulbagal Dosa Recipe: ప్రస్తుతం ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న వంటకాల్లో ముల్బాగల్ దోస కూడా ఒకటి. ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దోస.. ఇప్పుడు రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్లలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బయటివైపు బంగారు రంగులో కరకరలాడుతూ.. లోపల మాత్రం మెత్తగా, స్పాంజీగా ఉండటం దీని ప్రత్యేకత. దీనికి తోడు నెయ్యి, ఎర్రకారం, ఆలూ మసాలా, పుట్నాల పొడి కలవడంతో అద్భుతమైన రుచి వస్తుంది. మరి ఈ స్పెషల్ దోసను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Bengaluru Famous Mulbagal Dosa Recipe
Bengaluru Famous Mulbagal Dosa Recipe
  • ముల్బాగల్ దోస బయట క్రిస్పీగా, లోపల స్పాంజీగా ఉండటం దీని ప్రత్యేకత.
  • నెయ్యి, ఎర్రకారం, ఆలూ మసాలా, పుట్నాల పొడితో ఈ దోసకు అద్భుతమైన రుచి వస్తుంది.

Mulbagal Dosa Recipe: ప్రస్తుతం ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న వంటకాల్లో ముల్బాగల్ దోస కూడా ఒకటి. ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దోస.. ఇప్పుడు రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్లలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బయటివైపు బంగారు రంగులో కరకరలాడుతూ.. లోపల మాత్రం మెత్తగా, స్పాంజీగా ఉండటం దీని ప్రత్యేకత. దీనికి తోడు నెయ్యి, ఎర్రకారం, ఆలూ మసాలా, పుట్నాల పొడి కలవడంతో అద్భుతమైన రుచి వస్తుంది. మరి ఈ స్పెషల్ దోసను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

దోస పిండి తయారీకి కావాల్సిన పదార్థాలు

ముల్బాగల్ దోస తయారీలో సాధారణ దోస పిండికి భిన్నమైన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఇందుకోసం ఒక కప్పు మినప్పప్పు, ఐదు కప్పుల బియ్యం తీసుకోవాలి. వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు, రెండు టేబుల్ స్పూన్ల శెనగపప్పు, అర టీస్పూన్ మెంతులు, 50 గ్రాముల అటుకులు వేసుకోవాలి. విదేశాల్లో చల్లని వాతావరణంలో ఉండేవారు పిండి త్వరగా పులిసేందుకు ఒక టీస్పూన్ సోయాబీన్స్ కూడా కలుపుకోవచ్చు.

ముందుగా ఈ పదార్థాలన్నింటినీ శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తయారైన పిండిని పెద్ద గిన్నెలోకి తీసుకుని ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టాలి. పిండి బాగా పులిసి బుడగలు వచ్చిన తర్వాత మాత్రమే ఉప్పు కలపాలి. ఇలా చేయడం వల్ల దోస లోపల మెత్తగా, స్పాంజీగా తయారవుతుంది.

పుట్నాల పొడి తయారీ

ముల్బాగల్ దోసకు ప్రత్యేకమైన రుచిని ఇచ్చేది పుట్నాల పొడి. దీని కోసం కొద్దిగా నూనెలో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేయించుకోవాలి. ఆ తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, కరివేపాకు, పుట్నాలు, తగినంత ఉప్పు వేసి కొద్దిసేపు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీంతో రుచికరమైన పుట్నాల మసాలా సిద్ధమవుతుంది.

ఆలూ మసాలా (పలయ) తయారీ

దోసలో వేసే ఆలూ మసాలాను కర్ణాటకలో పలయ అని కూడా పిలుస్తారు. దీని తయారీకి ముందుగా పాన్‌లో నూనె వేసి ఆవాలు వేయించాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసి వేయించాలి. అనంతరం కరివేపాకు, పావు కప్పు నీళ్లు, మెత్తగా ఉడికించిన బంగాళాదుంపలు, ఉప్పు వేసి బాగా కలపాలి. బంగాళాదుంపలు మెత్తగా అయ్యేలా మిశ్రమాన్ని కలుపుతూ చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. దీంతో పలయ సిద్ధమవుతుంది.

స్పెషల్ ఎర్రకారం తయారీ

ముల్బాగల్ దోసకు మరో ప్రత్యేక ఆకర్షణ ఎర్రకారం. దీని కోసం మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో దోసపై పూసే ఘాటైన ఎర్రకారం సిద్ధమవుతుంది.

ముల్బాగల్ దోస తయారీ విధానం

ఈ దోస తయారీకి కాస్ట్ ఐరన్ పాన్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా పాన్‌ను వేడి చేసి కొద్దిగా నీళ్లు చల్లి ఉష్ణోగ్రత తగ్గించుకోవాలి. అనంతరం దోస పిండిని పోసి అంచుల వరకు కొద్దిగా విస్తరించాలి. వెంటనే దోసపై తగినంత నెయ్యి వేసి, ముందుగా తయారు చేసుకున్న ఎర్రకారాన్ని పూయాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒకవైపు మాత్రమే ఉడికించాలి. మూత పెట్టడం వల్ల ఆవిరికి దోస లోపలి భాగం మెత్తగా, స్పాంజీగా తయారవుతుంది.

దోస బాగా ఉడికిన తర్వాత దానిపై ఆలూ మసాలా, పుట్నాల పొడిని సమృద్ధిగా వేసుకోవాలి. అంచులు కరకరలాడుతూ, మధ్యభాగం మెత్తగా ఉండేలా కాల్చుకోవాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి దోసను ప్లేట్‌లోకి తీసుకోవాలి.

కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే అదిరిపోయే రుచి!

ఇంకేముంది.. వేడివేడి ముల్బాగల్ దోస సిద్ధమైనట్లే. బయట కరకరలాడుతూ, లోపల స్పాంజీగా ఉండే ఈ దోసను ఆలూ మసాలా, పుట్నాల పొడి, ఎర్రకారం కలయికతో తింటే అద్భుతమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా నెయ్యి సువాసన ఈ దోసకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది. కొబ్బరి చట్నీతో కలిపి సర్వ్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ రుచిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.

Tags

Be the first to react

Latest