జర్మనీ ఒక కీలక సమస్యు - కార్మికుల కొరత..
ఆసియా వైపు దేశం దృష్టి..
ప్రతి ఏడాది 4 లక్షల మంది..
యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జర్మనీ ప్రస్తుతం ఒక కీలక సమస్యను ఎదుర్కొంటోంది — కార్మికుల కొరత. దేశంలో వృద్ధాప్యం పెరుగుతుండడంతో, అనేక రంగాల్లో ఖాళీలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ కార్మికులను ఆకర్షించే దిశగా జర్మనీ ప్రభుత్వం, కంపెనీలు కలిసి కొత్త చర్యలు చేపడుతున్నాయి.
వియత్నాం నుంచి కార్మికులపై దృష్టి
జర్మనీలో పవర్ లైన్లు నిర్మించే కంపెనీ Omexom Hochspannung మేనేజింగ్ డైరెక్టర్ గీడో సైఫెన్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో నైపుణ్య కార్మికులను స్కిల్డ్ వర్కర్లు దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో పని చేయాల్సి రావడం వల్ల కుటుంబ జీవితం దూరమవుతుందని చాలామంది ఈ ఉద్యోగాలను ఎంచుకోవడం లేదు.
ఈ సమస్యకు పరిష్కారంగా వియత్నాం వైపు కంపెనీ దృష్టి మళ్లించింది. జర్మన్-వియత్నాం అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్ట్ ద్వారా అక్కడి యువతను శిక్షణ ఇచ్చి జర్మనీకి తీసుకురావాలని ప్రణాళిక చేస్తుంది.
శిక్షణ కేంద్రాలు, జర్మన్ భాషా కోర్సులు
వియత్నాం విద్యుత్ సంస్థ EVN ప్రత్యేకంగా ఓవర్‌హెడ్ లైన్ టెక్నీషియన్ల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు GIZ మద్దతు ఇస్తోంది. జర్మన్ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడానికి, అక్కడి ట్రైనర్లను జర్మనీకి తీసుకెళ్లి శిక్షణ ఇస్తారు. అలాగే జర్మన్ భాషా కోర్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రణాళిక ప్రకారం శిక్షణ పొందిన వారిలో సుమారు 200 మందికి జర్మనీలో ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త అలయన్స్
విదేశీ కార్మికులను న్యాయంగా నియమించేందుకు జర్మనీ ప్రభుత్వం “WE-Fair Alliance” అనే కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని BMZ మద్దతు ఇస్తోంది.
జర్మనీ అభివృద్ధి మంత్రి రీమ్ అలబాలి రడోవాన్ మాట్లాడుతూ, “దేశానికి నైపుణ్య కార్మికులు అత్యవసరం. ప్రస్తుతం ఉద్యోగుల్లో 20 శాతం మంది 55 ఏళ్లు దాటిన వారే ఉన్నారు. వచ్చే 10 ఏళ్లలో వీరిలో చాలామంది రిటైర్ అవుతారు” అని తెలిపారు.
భారీ అవసరం – ప్రతి ఏడాది 4 లక్షల మంది
నిపుణుల అంచనాల ప్రకారం, జర్మనీకి వచ్చే దశాబ్దంలో ప్రతి ఏడాది కనీసం 4 లక్షల విదేశీ నైపుణ్య కార్మికులు అవసరం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి ఏడాది సుమారు 16 లక్షల మంది దేశంలోకి వలస రావాల్సి ఉంటుంది.
ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఆశలు
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో యువ జనాభా ఎక్కువగా ఉండటంతో, అక్కడి నుంచి కార్మికులను ఆకర్షించేందుకు జర్మనీ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ దేశాల ప్రభుత్వాలు కూడా నైపుణ్య వలస మార్గాలను బలోపేతం చేయాలని కోరుతున్నాయి.
కంపెనీల అంచనాలు వాస్తవానికి దూరం
కానీ, విదేశీ కార్మికులను తీసుకురావడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎడిత్ ఒటియెండే-లావానీ అనే కన్సల్టెంట్ మాట్లాడుతూ, “కంపెనీలు పూర్తిగా శిక్షణ పొందిన ఉద్యోగులు వెంటనే పని మొదలుపెడతారని భావించడం తప్పు” అన్నారు.
భాష, సంస్కృతి, పని విధానంలో తేడాలు ఉండటంతో సమన్వయం సాధించడం సమయం తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
బ్యూరోక్రసీ అడ్డంకులు
జర్మనీలో వీసా, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి. మార్కస్ లోట్ష్ ప్రకారం, “ఎక్స్‌ప్రెస్ ప్రాసెస్ అన్నా కూడా చాలా సందర్భాల్లో ఆలస్యం జరుగుతోంది” అన్నారు.
విదేశీయులు దేశం విడిచిపోతున్న పరిస్థితి
ఇంకా ఒక పెద్ద సమస్య ఏమిటంటే, విదేశీ కార్మికులు జర్మనీకి వచ్చాక ఎక్కువ కాలం ఉండడం లేదు. 2024లో మొదటిసారిగా దేశానికి వచ్చినవారికంటే వెళ్లిపోయినవారి సంఖ్య ఎక్కువగా నమోదైంది.
ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ, విదేశీయుల పట్ల సమాజంలో ఉన్న దృక్పథం కూడా ప్రభావం చూపుతోంది. జాస్మిన్ అర్బాబియన్-వోగెల్ మాట్లాడుతూ, “విదేశీయులను ఎలా చూస్తున్నామన్నది దేశ ఆకర్షణను నిర్ణయిస్తుంది” అన్నారు.
జర్మనీకి నైపుణ్య కార్మికులు అత్యవసరం. అయితే వారిని తీసుకురావడం మాత్రమే కాదు, వారికి అనుకూల వాతావరణం కల్పించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.