జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమాలు, మృతుల పేర్లపై జాబ్ కార్డులు, వలసపోయిన వారి పేర్లు లాంటి సమస్యలను తొలగించడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈకేవైసీ పూర్తి చేయని కార్డులను రద్దు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆచూకీ లేని వారు, మరణించిన వారు వంటి కేటగిరీల్లో ఉండే 64,000 జాబ్ కార్డులు రద్దు చేశారు. ఇంకా దాదాపు 48,000 మంది కూలీలు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్ణీత సమయానికి ఈకేవైసీ చేయకపోతే వారి కార్డులు కూడా రద్దు కానున్నాయి.
ఉపాధి హామీ పథకంపై ఈకేవైసీ ప్రభావం గణనీయంగా ఉంటుందని లిబ్‌టెక్ ఇండియా సర్వే పేర్కొంది. ఏపీలో దాదాపు 38 లక్షల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని సర్వేలో తేలింది. గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు, టెక్నికల్ ఇబ్బందుల వల్ల చాలా మంది కూలీలు ఈకేవైసీ చేయించుకోలేకపోతున్నారని పేర్కొంది. అందువల్ల ఈకేవైసీను తప్పనిసరిగా కాకుండా సడలింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.
ఇదిలా ఉండగా, ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో నిలవడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఏపీ ఇప్పటికే దాటి 15.66 కోట్లు పూర్తి చేసింది. పుదుచ్చేరి, రాజస్థాన్‌ల తర్వాత అత్యధిక పనిదినాలు అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
ఇక తెలంగాణకు 6.50 కోట్ల పనిదినాలు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం వరకు 5.47 కోట్ల పనిదినాలు మాత్రమే వాడుకున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక వెల్లడించింది. ఈకేవైసీ కారణంగా తొలగింపులు, సాంకేతిక సమస్యలు, వలసలు వంటి అంశాలు భవిష్యత్తులో పథకం అమలుపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.