దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వాయు కాలుష్యంతో అల్లాడుతోంది. వరుసగా మూడో రోజు కూడా గాలి నాణ్యత సూచీ (AQI) 400 మార్క్‌ను దాటి ‘తీవ్ర’ స్థాయిలోనే నమోదైంది. బుధవారం ఉదయం నుండి నగరాన్ని ఘనమైన పొగమంచు కమ్మేసింది. ముఖ్యంగా ప్రధాన రహదారులు, చౌరస్తాలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో దృశ్యమానత గణనీయంగా పడిపోయింది. దీంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించడం కష్టమవుతోంది. కాలుష్య స్థాయిలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లడానికే భయపడుతున్నారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఢిల్లీలోని అనేక ప్రాంతాలు విషవాయువుల చాపకింద ఉన్నట్టే మారాయి. గీతా కాలనీ-లక్ష్మీ నగర్ రోడ్ వద్ద AQI 413గా, ఇండియా గేట్, కర్తవ్య పథ్ ప్రాంతాల్లో 408గా నమోదైంది. చాందినీ చౌక్‌లో 449, ఆనంద్ విహార్‌లో 438, అశోక్ విహార్‌లో 439, ద్వారకా సెక్టార్-8లో 422, ఐటీఓ వద్ద 433గా నమోదవడంతో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇంతటి కాలుష్యానికి ఎక్కువసేపు గురైతే శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)లో భాగంగా ఫేజ్-3 నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం దృష్ట్యా, 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. “విద్యార్థుల ఆరోగ్యం మాకు ముఖ్యమైంది. కాలుష్య నియంత్రణ కోసం అన్ని చర్యలు వేగవంతం చేశాం. బుధవారం నుంచి పాఠశాలలు హైబ్రిడ్ విధానంలోనే కొనసాగుతాయి” అని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వెల్లడించారు.
ఇక, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని కాలుష్య పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. వాహన ఉద్గారాలు, నిర్మాణ కార్యకలాపాలు, ధూళి కాలుష్యం తగ్గించే చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా, కాలుష్య సమస్యను నియంత్రించకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.