రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తన గత నిర్ణయాలు, చర్యలపై ఆత్మపరిశీలన చేసిన అనంతరం ఆయన ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్‌లకు క్షమాపణలు తెలిపారు. సోషల్ మీడియాలో తనపై తీవ్రమైన విమర్శలు రావడంతో, తాను చేసిన తప్పులు ఏవో గుర్తించి లోతుగా ఆలోచించినట్లు చెప్పారు.
తాను 30 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో సేవలందించానని, ఆ కాలంలో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదని ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఏనాడూ ప్రవర్తించలేదని, కానీ కొంతమంది అధికారులపై తీసుకున్న నిర్ణయాలు తప్పుగా మారాయని అంగీకరించారు. ఆ తప్పుల కారణంగానే తాను వాలంటరీ రిటైర్మెంట్ (VRS)కు దరఖాస్తు చేసుకున్నానని వివరించారు.
2000 నుండి 2004 వరకు గుంటూరు, విజయవాడ నగరాల మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో తన సేవలతో ప్రజాదరణ పొందానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రజలు తనను హీరోగా భావించారని, కానీ ఒకే తప్పుతో ఆ హీరో ఇమేజ్ విలన్‌గా మారిపోయిందని బాధతో చెప్పారు.
2020లో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయం నుంచి ఫైల్ వచ్చినట్లు తెలిపారు. ఆ ఫైల్ ప్రకారం నిర్ణయం తీసుకున్నానని, కానీ అది తప్పుడు నిర్ణయమని ఇప్పుడు గ్రహించానని చెప్పారు. అలాగే జాస్తి కృష్ణకిషోర్ విషయంలోనూ తాను తప్పు చేశానని అంగీకరించారు.
ప్రవీణ్ ప్రకాష్ చివరగా మాట్లాడుతూ, సమాజం పెట్టిన పరీక్షలో తాను విఫలమయ్యానని అన్నారు. తన తప్పులు తెలుసుకుని క్షమాపణ చెప్పడం ద్వారా మనశ్శాంతి పొందాలనుకుంటున్నానని పేర్కొన్నారు. “నా ఈ క్షమాపణ హృదయపూర్వకమైనది. నా తప్పుల నుంచి నేర్చుకున్నాను,” అని భావోద్వేగంగా చెప్పారు.