రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు లేదా వృద్ధ మహిళలకు సాధారణంగా లోయర్ బెర్త్ కేటాయించాలని రైల్వే నిబంధనలు చెబుతాయి. అయినప్పటికీ చాలామంది వృద్ధులు, పెద్దవయసు మహిళలు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ తమకు లోయర్ బెర్త్ రాలేదని తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో టిటికి లోయర్ బెర్త్ ఇవ్వమని అభ్యర్థించే దృశ్యాలు తరచూ కనిపిస్తాయి. ఈ పరిస్థితిపై ఒక రైల్వే టీటీఈ (TTE) సోషల్ మీడియాలో ఇచ్చిన వివరణ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆయన చెప్పిన వివరాలు చాలామందికి అవగాహన కలిగించేలా ఉన్నాయి.
టీటీఈ వివరాల ప్రకారం, రైల్వేలో గర్భిణీలకు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు దాటిన పురుషులకు ప్రత్యేక లోయర్ బెర్త్ కోటా ఉంటుంది. అంటే, బుకింగ్ సమయంలో “Senior Citizen Quota” లేదా “Lower Berth Quota” ఎంచుకుంటే మాత్రమే ఆ ప్రయాణికులకు ప్రాధాన్యతగా లోయర్ బెర్త్ కేటాయించబడుతుంది. స్లీపర్ క్లాస్‌లో ప్రతి కోచ్‌లో 6–7 లోయర్ బెర్త్‌లు, ఏసీ 3 టైర్‌లో 4–5 బెర్త్‌లు, ఏసీ 2 టైర్‌లో 3–4 బెర్త్‌లను ఈ కోటా కింద కేటాయిస్తారు. అయితే ఈ సదుపాయం కేవలం సీనియర్ సిటిజన్లు ఒంటరిగా లేదా ఇద్దరు సీనియర్ సిటిజన్లు కలిసి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది.
చాలా మంది ఈ విషయాన్ని తెలియకపోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో చిన్న పొరపాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు — ఒకే పీఎన్‌ఆర్‌లో సీనియర్ సిటిజన్‌తో పాటు యువకులు లేదా కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించేలా టికెట్ బుక్ చేస్తే, ఆ బుకింగ్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా ‘జనరల్ కోటా’గా పరిగణిస్తుంది. దీంతో సీనియర్ సిటిజన్‌కు లభించాల్సిన లోయర్ బెర్త్ కేటాయింపు జరగదు. ఇదే కారణంగా వృద్ధులకు తరచూ మిడిల్ లేదా అప్‌పర్ బెర్త్‌లు వస్తున్నాయని టీటీఈ తెలిపారు.
అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే బుకింగ్ సమయంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా టికెట్ బుక్ చేయాలని ఆయన సూచించారు. అంటే వృద్ధులు లేదా పెద్దవయసు మహిళలు ప్రయాణించే టికెట్లను వేరుగా బుక్ చేయడం ద్వారా లోయర్ బెర్త్ దొరికే అవకాశం పెరుగుతుందని చెప్పారు. అలాగే ప్రయాణం ముందుగా ప్లాన్ చేసి టికెట్ బుక్ చేసుకోవడం వల్ల కూడా లోయర్ బెర్త్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రైల్వే ప్రయాణికులు దీనిని బాగా ఆదరిస్తున్నారు.