ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) ప్రాంతంలో తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలను హరించేస్తున్న వేళ, ఎయిర్ ప్యూరిఫయర్లపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ వసూలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలు శ్వాస తీసుకోవడానికే ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో కనీసం కాలుష్య నియంత్రణకు ఉపయోగపడే పరికరాలపై పన్ను తగ్గించలేరా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘‘కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమవుతున్నారు.. కనీసం ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించే పరికరాలపై పన్ను తగ్గించడమూ చేతకాదా?’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ అంశంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఎయిర్ ప్యూరిఫయర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ అడ్వకేట్ కపిల్ మదన్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది స్పందించేందుకు 15 రోజుల సమయం కావాలని కోరగా, ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అత్యవసర పరిస్థితుల్లో ఇంత ఆలస్యం ఎందుకని నిలదీసింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని గుర్తు చేసిన ధర్మాసనం, ‘‘ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోలేరా? ఎంతమంది మరణిస్తే అప్పుడు చర్యలు తీసుకుంటారు?’’ అని ప్రశ్నించింది. కనీసం తాత్కాలికంగా అయినా ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వవచ్చుకదా అని సూచించింది. ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా ఉండాలని స్పష్టం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై ఈ అంశంపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కాలుష్యంతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫయర్లు విలాస వస్తువులు కాదని, అవి అవసరమైన ఆరోగ్య రక్షణ పరికరాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కోవిడ్ సమయంలో మాస్కులు, శానిటైజర్లపై పన్ను తగ్గించినట్టే, ఇప్పుడు కూడా కాలుష్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ తగ్గించాలని కోరారు. ఈ అంశంపై కేంద్రం సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.