అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న మొత్తం 92 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 14 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు కాగా, మిగిలిన 78 పోస్టులు అంగన్వాడీ సహాయకులవి. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాగా, డిసెంబర్ 31 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
ఈ నియామక ప్రక్రియ 11 ప్రాజెక్టుల పరిధిలో కొనసాగుతోంది. పదో తరగతి అర్హత కలిగిన మహిళలకు ఇది మంచి అవకాశం అని అధికారులు చెబుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల రెండు కేటగిరీలకూ పదో తరగతి ఉత్తీర్ణతనే కనీస అర్హతగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమకు సంబంధించిన ప్రాజెక్టు సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలను అధికారులు నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించారు. రోస్టర్ పాయింట్ల ప్రకారం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని, సంబంధిత రిజర్వేషన్ కేటగిరీకి చెందినవారే అప్లై చేయాలని స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో పూర్తి సమాచారం కూడా అందుబాటులో ఉంచారు.
తాడిపత్రి ప్రాజెక్టులో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు తాడిపత్రిలో 4, శింగనమలలో 3, ఉరవకొండలో 2, గుత్తి, కళ్యాణదుర్గం, నార్పల, రాయదుర్గం, కణేకల్లు ప్రాంతాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయి. సహాయకుల పోస్టులు తాడిపత్రిలో 14, ఉరవకొండ, నార్పలలో 12 చొప్పున, శింగనమలలో 10 పోస్టులు ఉన్నాయి. అనంతపురం అర్బన్, రూరల్ తదితర ప్రాంతాల్లో కూడా ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
అర్హతలు, పత్రాల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, 2025 జులై 1 నాటికి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుతో పాటు కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, పుట్టిన తేదీ, పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు జిరాక్సులను గెజిట్ అధికారి ధృవీకరణతో జత చేయాలని అధికారులు సూచించారు.