ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గత నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లె, మార్కాపురం, పోలవరం అనే మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ఆరు కొత్త రెవెన్యూ డివిజన్లు, ఒక కొత్త మండలాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ మార్పులపై ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది.
ఈ పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాల కలెక్టర్లకు 500కుపైగా విన్నపాలు, అభ్యంతరాలు అందినట్లు సమాచారం. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యంతరాలు రావడం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది. నెల్లూరు జిల్లాలోని కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ మూడు మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అధికార పార్టీ టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ అంశంపై ప్రభుత్వానికి వరుసగా లేఖలు రాశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులను కలిసి ప్రజల అభిప్రాయాలను వివరించారు.
ప్రజల నిరసన తీవ్రత ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మండలాలను ఏ ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో కలిపారన్న అంశంపై అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ అంశంపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రజల వ్యతిరేకతకు గల కారణాలు, స్థానిక అవసరాలు, రాజకీయ పరిస్థితులపై అధికారులు విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు.
ప్రజా స్పందనను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో విలీనం చేసిన కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంపై ఈ నెల 28న జరగనున్న కీలక సమావేశంలో అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నారు.
ఇదే సమయంలో కర్నూలు జిల్లా ఆదోని మండల విభజన కూడా వివాదాస్పదంగా మారింది. ఆదోని మండలాన్ని విభజించి 17 గ్రామాలతో పెద్ద హరివాణం మండలాన్ని ఏర్పాటు చేయడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్ద హరివాణం మండల కేంద్రం కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, చాలా గ్రామాలకు అది 30–40 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కారణాలతో ప్రజలు ఆదోనిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు, సంఘాల ప్రతినిధులు రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. ఈ అంశంపై నంద్యాల జిల్లా కలెక్టర్ నుంచి ఇప్పటికే సమగ్ర నివేదిక కోరినట్లు రెవెన్యూ శాఖ తెలిపింది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ నెల 28న జరగనున్న సమావేశంలో కలెక్టర్ల నివేదికలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రికి నివేదించి, ఆయన ఆమోదంతో మంత్రివర్గం ముందు పెట్టనున్నారు. మంత్రివర్గ ఆమోదం లభించిన తర్వాత తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.