Germany: జర్మనీలో సిక్ లీవ్ నిబంధనలు కఠినతరం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన!
Germany: జర్మనీ ప్రభుత్వం ఉద్యోగుల సిక్ లీవ్ (అనారోగ్య సెలవులు) నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకొచ్చిన 34 సంస్కరణల ప్యాకేజీలో ఇది ముఖ్యమైన ప్రతిపాదనగా ఉంది.
మొదటి రోజునే డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి? జర్మనీ కీలక నిర్ణయం..
సిక్ లీవ్ విధానంలో భారీ మార్పులకు జర్మనీ ప్రభుత్వం సిద్ధం..
జర్మనీ ప్రభుత్వం ఉద్యోగుల సిక్ లీవ్ (అనారోగ్య సెలవులు) నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకొచ్చిన 34 సంస్కరణల ప్యాకేజీలో ఇది ముఖ్యమైన ప్రతిపాదనగా ఉంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఉద్యోగులు మూడు రోజుల వరకు వైద్య ధృవీకరణ లేకుండానే సెలవు తీసుకోవచ్చు. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, మొదటి రోజునే డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే ఉద్యోగదాత (ఎంప్లాయర్) మొదటి రోజునే మెడికల్ సర్టిఫికెట్ అడగవచ్చు.
అలాగే ఫోన్ ద్వారా వారం రోజుల సిక్ లీవ్ సర్టిఫికెట్ తీసుకునే విధానాన్ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులు నిజంగా అనారోగ్యంగా ఉన్నారా అనే విషయాన్ని నిర్ధారించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం అని ప్రభుత్వం తెలిపింది.
చాన్సలర్ మెర్జ్ మాట్లాడుతూ, దేశంలో అనవసరంగా సిక్ లీవ్ తీసుకునే సంఖ్య ఎక్కువగా ఉందని, ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపుతోందని అన్నారు. “జర్మనీని తిరిగి అభివృద్ధి దారిలోకి తీసుకురావడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.
జర్మనీలో ఉద్యోగులకు సాధారణంగా ఆరు వారాల వరకు పేడ్ సిక్ లీవ్ అవకాశం ఉంది. అదనంగా సంవత్సరానికి ఆరు వారాల సెలవులు కూడా ఉంటాయి. ఈ కారణంగా దీర్ఘకాల గైర్హాజరు పెరుగుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కోవిడ్ తర్వాత జర్మనీ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండగా, ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ఎనర్జీ ఖర్చులు, చైనాతో పోటీ, జనాభా సమస్యలు వంటి అంశాలు కూడా ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు తెలిపారు. కొత్త సంస్కరణల లక్ష్యం బ్యూరోక్రసీ తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ స్థిరమైన వృద్ధి దిశగా తీసుకెళ్లడం అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tags
Be the first to react