తెలంగాణ సాహితీ లోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ ప్రజాకవి డా. అందెశ్రీ ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణాన్ని అభిమానులు, సాహితీవేత్తలు, రాజకీయ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మరణానికి గంటల ముందు వరకూ ఆయన సజావుగానే ఉన్నారనే విషయం మరింత బాధను కలిగిస్తోంది. నిన్న సమాచార హక్కు కమిషనర్ అయోధ్య రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప పూజ కార్యక్రమానికి హాజరైన అందెశ్రీ పూజలో పాల్గొని, అక్కడ ఉన్నవారితో కాసేపు ముచ్చటించారు.
రాత్రి ఇంటికి చేరుకుని, భోజనం చేసి, ఎలాంటి అస్వస్థత లేకుండా నిద్రపోయారని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఉదయం నిద్రపట్టిన ఆయనను లేపే ప్రయత్నంలో స్పందించకపోవడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.
తెలంగాణ గర్వకారణమైన ప్రజాగీతం జయ జయ హే తెలంగాణ…ను ప్రపంచానికి వినిపించి రాష్ట్ర భావజాలాన్ని అద్భుతంగా వ్యక్తీకరించిన అందెశ్రీ మరణంతో లక్షలాది మంది అభిమానులు వేదన చెందుతున్నారు. ఉద్యమ కాలంలో ఆయన రచించిన పాటలు ప్రజలను జాగృతం చేశాయి. “పల్లె నీకు వందనాలమ్మో”, “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు”, “జనజాతరలో మన గీతం” వంటి ఎన్నో ప్రజాస్వామ్య గీతాలు నేటికీ పలువురి హృదయాల్లో నిలిచిపోయాయి. సామాజిక చైతన్యం, ఉద్యమ స్పూర్తి, మానవ విలువలు… ఇవన్నింటినీ ఒక్కొక్క పదంలో నిలబెట్టగల కవి అందెశ్రీ. ఆయన ఆ పదజాలం ఇక వినిపించదనే ఆలోచన సాహితీ ప్రియులను కేదరింపజేస్తోంది.
ప్రజాకవిగా పేరుపొందిన అందెశ్రీ తెలుగు సాహిత్యంలో తన సొంత ముద్ర వేసుకున్నారు. ఆయన రచనలు గ్రామీణ జీవన విధానాన్ని, సామాజిక సమస్యలను, మనిషి అంతర్మనస్సు పోరాటాలను ప్రతిబింబిస్తూ వచ్చాయి. ఉద్యమ గీతకారుడిగానే కాకుండా, ఆధునిక కవిత్వానికి ఆయన ఇచ్చిన సేవ కూడా అమోఘం. భావాన్ని నేరుగా హృదయానికి చేరేలా చెప్పగలిగిన అరుదైన సామర్థ్యం అందెశ్రీకి ఉంది. అందుకే ఆయన కవితలు, పాటలు కేవలం సాహిత్యం మాత్రమే కాదు ప్రజల హృదయాల గుండెకాయ.
అందెశ్రీ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “తెలుగు సాహితీ ప్రపంచం ఒక గొప్ప కవిని కోల్పోయింది. తెలంగాణకు రాష్ట్ర గీతం అందించిన అందెశ్రీ మరణం తీరని లోటు” అని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సహా పలువురు నేతలు ఆయన మరణంపై విచారం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాహితీవేత్తలు, రచయితలు, సామాన్య ప్రజలు అందెశ్రీను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో అనేక సందేశాలు పెడుతున్నారు. ఆయన రచనలు శాశ్వతం, ఆయన స్వరం నిత్యం ప్రజలలో జీవించిపోతుందని అభిమానులు అంటున్నారు. తన జీవితాంతం ప్రజల కోసం, భాష కోసం, తెలంగాణ గౌరవం కోసం కలం పట్టిన అందెశ్రీ…
ఇక సెలవంటూ దివికేగారు.