ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, అసెంబ్లీలో స్పీకర్‌గా ఉన్న తనను “అధ్యక్షా” అని సంబోధించడం ఆయనకు ఇష్టం లేకపోవడమే సభకు హాజరు కాకపోవడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. మీడియా ముందు మాట్లాడటం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని జగన్‌ను సవాల్ చేశారు.
సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్న అనంతరం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. “జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే. ఆయనకు సభలో మాట్లాడటానికి సాధారణ సభ్యుడికి ఇస్తే ఎంత సమయం ఇస్తామో, అంతే ఇస్తాం. ఆయనకు ప్రత్యేకంగా ఏదీ ఇవ్వం. కానీ ఆయన స్పీకర్ స్థానంలో ఉన్న నన్ను చూసి మాట్లాడే ఇష్టం లేకే సభకు రావట్లేదు” అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వైసీపీకి చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటూ సభకు రాకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ సభను బహిష్కరించడం ప్రజల పట్ల అవమానమని ఆయన అన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనపై కూడా అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. “పూర్వ కాలంలో రాక్షసుల నుంచి రాజ్యాన్ని కాపాడుకోవడానికి యాగాలు చేసేవారు. అలాంటి రాక్షస పాలనను ఏపీ ప్రజలు గత ఐదేళ్లలో చూశారు. జగన్‌కు అధికారం మాత్రమే తెలుసు, కానీ పరిపాలన చేయడం రాదు. ఆయన మూర్ఖపు పాలన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయింది. ప్రజా ధనాన్ని దోచి, ఖజానా ఖాళీ చేశారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు ఆ రాక్షస పాలన నుంచి బయటపడటానికే కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ అజెండా ప్రకారం ప్రభుత్వ పనులను వక్రీకరిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు నిజం తెలియజేయడం తమ బాధ్యతగా ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు.