మెటా కంపెనీకి చెందిన వాట్సాప్ వినియోగదారుల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఒక్కో చాట్‌లోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు, లింకులు వెతకాల్సి వచ్చేది. అయితే త్వరలో రాబోతోన్న మీడియా హబ్ (Media Hub) అనే కొత్త ఫీచర్‌తో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించనుంది.
ఈ ఫీచర్ ప్రస్తుతం పరిమితంగా WhatsApp Web మరియు Mac వెర్షన్ లో పరీక్షించబడుతోంది. అందులో వినియోగదారులు తమకు పంపిన ఫోటోలు, వీడియోలు, GIFలు, లింకులు, డాక్యుమెంట్లు అన్నీ ఒకే చోట చూడగలుగుతారు. అంటే ఒక్కో చాట్ తెరవాల్సిన అవసరం లేకుండా అన్ని మీడియా ఫైల్స్‌ను ఒకే స్క్రీన్‌లో పొందవచ్చు.
మీడియా హబ్‌లో ఒక ప్రత్యేక సెర్చ్ బార్ ఉంటుంది. దాని ద్వారా ఫైల్‌ను షేర్ చేసిన కాంటాక్ట్ పేరు, ఫైల్ క్యాప్షన్ లేదా షేర్ చేసిన తేదీతో వెతకవచ్చు. దీంతో మీరు కావలసిన ఫోటో లేదా వీడియోను సులభంగా కనుగొనవచ్చు.
వాట్సాప్ కొత్త ఫీచర్‌లో మరో ప్రయోజనం ఏమిటంటే మీరు ఫైల్‌లను సైజ్ ఆధారంగా సార్ట్ చేయవచ్చు. పెద్ద ఫైల్‌లు ముందు కనిపిస్తాయి. దీని ద్వారా మొబైల్ లేదా కంప్యూటర్ స్పేస్‌ను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు.
కొత్త మీడియా హబ్‌లో మల్టీ సెలెక్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు ఒకేసారి అనేక ఫైల్‌లను సెలెక్ట్ చేసి వాటిని డిలీట్ చేయడం, షేర్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం చేయగలరు. ఈ ఫీచర్ ప్రత్యేకంగా పెద్ద మొత్తంలో మీడియా ఉన్న వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రయోగాత్మకంగా కొంతమంది వినియోగదారులకే అందిస్తోంది. మే నెలలో మొదటిసారి అభివృద్ధిలో ఉన్నట్లు గుర్తించిన ఈ ఫీచర్, ఇప్పుడు పరిమితంగా అందుబాటులోకి వస్తోంది. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించిన తరువాత, పూర్తి స్థాయి విడుదల చేయనున్నట్లు సమాచారం.
వాట్సాప్ ఇటీవలే ఆపిల్ వాచ్ యాప్ ను విడుదల చేసింది. ఇప్పుడు వాచ్ నుంచే వాయిస్ మెసేజ్‌లు పంపడం, కాల్ నోటిఫికేషన్లు చూడడం, చాట్ హిస్టరీ యాక్సెస్ చేయడం వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, సైబర్ దాడుల నివారణ కోసం
స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ అనే మరో కొత్త సెక్యూరిటీ ఆప్షన్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది.
ఈ కొత్త మీడియా హబ్ ఫీచర్ వల్ల వాట్సాప్ అనుభవం మరింత సులభతరం కానుంది. చాట్లన్నింట్లో ఉన్న మీడియా ఫైల్‌లను ఒకే చోట సజావుగా చూడడం, ఫిల్టర్ చేయడం, మేనేజ్ చేయడం ఇవన్నీ ఒక బటన్‌తో సాధ్యమవుతాయి.