NITI Aayog: దేశంలో 8.7 కోట్ల మంది యువత ఖాళీగా.. సంచలన విషయాలు వెల్లడించిన నీతి ఆయోగ్ నివేదిక!

NITI Aayog: దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువతలో పెద్ద సంఖ్యలో ఉద్యోగం, విద్య, నైపుణ్య శిక్షణకు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువుకోవడం, పనిచేయడం లేదా ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ పొందడం లేదని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.

NITI Aayog
NITI Aayog

డిగ్రీ ఉన్నా ఉద్యోగ నైపుణ్యాలు లేవు.. యువతపై నీతి ఆయోగ్ కీలక నివేదిక..

వికసిత్ భారత్-2047కు స్కిల్స్‌దే కీలక పాత్ర.. యువతపై నీతి ఆయోగ్ కీలక సూచనలు..

న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువతలో పెద్ద సంఖ్యలో ఉద్యోగం, విద్య, నైపుణ్య శిక్షణకు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువుకోవడం, పనిచేయడం లేదా ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ పొందడం లేదని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.

‘రిమైనింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్-2047’ పేరుతో విడుదల చేసిన నివేదికలో దేశంలో నైపుణ్యాభివృద్ధి పరిస్థితి, యువతకు ఎదురవుతున్న ఉపాధి సమస్యలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించింది.

8.7 కోట్ల మంది యువతకు దిశ ఏంటి?
15–29 ఏళ్ల వయసు కీలకమైన దశ. ఈ సమయంలో విద్యతో పాటు నైపుణ్యాలను పెంచుకుని ఉద్యోగం లేదా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే దేశంలో కోట్లాది మంది యువత ఈ మూడు మార్గాల్లోనూ ముందుకు సాగడం లేదని నివేదిక పేర్కొంది.

వీరిలో చాలామంది చదువు కొనసాగించడం లేదు. ఉద్యోగం చేయడం లేదు. ఉపాధి కోసం అవసరమైన స్కిల్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం లేదు. దీంతో వారి సామర్థ్యం పూర్తిస్థాయిలో వినియోగం కావడం లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.

డిగ్రీ ఉన్నా.. ఉద్యోగానికి సరిపడే నైపుణ్యాలు లేవు 
దేశంలో మరో ముఖ్యమైన సమస్యను కూడా నివేదిక ప్రస్తావించింది. డిగ్రీ చదివినప్పటికీ చాలామంది యువతకు పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్, ఉద్యోగ నైపుణ్యాలు అందడం లేదని తెలిపింది.

విద్యా సంస్థల్లో పొందిన జ్ఞానానికి, పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలకు మధ్య అంతరం ఉండటంతో కొందరు పట్టభద్రులు తమ విద్యార్హతకు సరిపోని ఉద్యోగాల్లో చేరుతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు చిన్నాచితక పనులు చేయాల్సి రావడం, తక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాల్లో చేరడం వంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

డిగ్రీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం 
యువతకు కేవలం డిగ్రీలు అందించడం సరిపోదని నీతి ఆయోగ్ సూచించింది. డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంచేలా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది. విద్యార్థులకు పరిశ్రమలతో అనుసంధానం, ప్రాక్టికల్ శిక్షణ, పని అనుభవం వంటి అవకాశాలు పెంచితే చదువు పూర్తయ్యే సమయానికే ఉద్యోగానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది.

స్థానిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ 
ప్రతి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఒకే విధంగా ఉండవు. అందువల్ల అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన నైపుణ్య శిక్షణ కాకుండా స్థానిక అవసరాలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా స్కిల్ ట్రైనింగ్ అందించాలని నీతి ఆయోగ్ సూచించింది. స్థానికంగా ఏ రంగాల్లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు ఉన్నాయో గుర్తించి, ఆ రంగాలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

స్కిల్ ట్రైనింగ్‌కు రాయితీలు ఇవ్వాలి 
చదువు, ఉద్యోగం, శిక్షణకు దూరంగా ఉన్న యువతను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వైపు తీసుకురావడానికి శిక్షణలో రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని నివేదిక సూచించింది. ఆర్థిక కారణాలతో శిక్షణ తీసుకోలేని యువతకు ప్రభుత్వ సహాయం అందితే మరింత మంది నైపుణ్యాలను పెంచుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి
ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. నైపుణ్య శిక్షణతో పాటు రుణ సదుపాయాలు, మార్కెట్ అవకాశాలు, వ్యాపార నిర్వహణపై అవగాహన కల్పిస్తే యువత ఉద్యోగాలు వెతకడమే కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగవచ్చని సూచించింది.

వికసిత్ భారత్ లక్ష్యానికి స్కిల్స్ కీలకం
వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలంటే నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశంలో యువత సంఖ్యను ఆర్థిక బలంగా మార్చాలంటే వారికి సరైన విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.

దేశ భవిష్యత్తుకు యువతే ప్రధాన బలం. ఆ బలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలంటే డిగ్రీతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు, స్థానిక ఉపాధికి అనుగుణమైన శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం అవసరమని నివేదిక సూచించింది.

8.7 కోట్ల మంది యువత ఖాళీగా ఉన్నారనే గణాంకం కేవలం ఒక సంఖ్య కాదు. దేశ యువశక్తిని సరైన దిశలో నడిపించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే కీలక హెచ్చరికగా దీన్ని చూడాల్సి ఉంటుంది.

Tags

Be the first to react

Latest