సెలవులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? స్కూలుకు వెళ్లే చిన్న పిల్లల నుంచి, ఆఫీసులో ఫైళ్లతో కుస్తీ పట్టే ఉద్యోగుల వరకు అందరికీ సెలవు అంటే ఒక రకమైన ఉత్సాహం. ప్రస్తుతం మనం డిసెంబర్ నెలలో క్రిస్మస్ వేడుకల మూడ్‌లో ఉండగానే, కొత్త ఏడాది 2026 మనకు భారీ సెలవులతో స్వాగతం పలుకుతోంది. సాధారణంగా జనవరి అంటేనే సంక్రాంతి పండుగ హడావుడి ఉంటుంది. కానీ ఈసారి సంక్రాంతితో పాటు రెండు అదిరిపోయే 'లాంగ్ వీకెండ్స్' (వరుస సెలవులు) కూడా రాబోతున్నాయి.
మీరు గనుక కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే, ఈ జనవరిని ఒక మర్చిపోలేని వెకేషన్ నెలగా మార్చుకోవచ్చు. అవేంటో వివరంగా చూద్దాం...
న్యూ ఇయర్ ధమాకా (వరుసగా 4 రోజులు) కొత్త ఏడాది ప్రారంభంలోనే మొదటి వారం మనకు మంచి వెకేషన్ మూడ్ తీసుకొస్తోంది.
జనవరి 1 (గురువారం): న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ సెలవు.
జనవరి 2 (శుక్రవారం): ఇది వర్కింగ్ డే. అయితే, మీరు ఈ ఒక్క రోజు సెలవు తీసుకోగలిగితే, మీకు అదృష్టం తలుపు తట్టినట్లే..
జనవరి 3 (శనివారం): వారాంతపు సెలవు.
జనవరి 4 (ఆదివారం): సాధారణ సెలవు.
చిట్కా: శుక్రవారం ఒక్క లీవ్ పెడితే చాలు, వరుసగా 4 రోజులు కొత్త ఏడాది వేడుకలను జరుపుకోవచ్చు.
సంక్రాంతి సెలవుల సందడి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే ఊళ్లకు వెళ్లే సందడి. 2026లో పండుగ తేదీలు ఇలా ఉన్నాయి.
జనవరి 13 (మంగళవారం): భోగి
జనవరి 14 (బుధవారం): మకర సంక్రాంతి / పొంగల్
జనవరి 15 (గురువారం): కనుమ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విద్యాసంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. సాధారణంగా జనవరి 10 నుండి 18 వరకు విద్యార్థులకు సెలవుల జాతర కొనసాగుతుంది.
రిపబ్లిక్ డే వీకెండ్ (వరుసగా 4 రోజులు) జనవరి చివరి వారంలో దేశభక్తితో పాటు విహారయాత్రలకు మరో అవకాశం లభిస్తోంది.
జనవరి 23 (శుక్రవారం): వసంత పంచమి (కొన్ని రాష్ట్రాల్లో/సంస్థల్లో ఆప్షనల్ హాలీడే). ఒకవేళ మీరు ఈ రోజు సెలవు తీసుకుంటే..
జనవరి 24 (శనివారం): వారాంతపు సెలవు. జనవరి 25 (ఆదివారం): సాధారణ సెలవు.
జనవరి 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (పబ్లిక్ హాలిడే).
శుక్రవారం సెలవు తీసుకుంటే, ఇక్కడ కూడా వరుసగా 4 రోజుల లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఇతర ముఖ్యమైన రోజులు: జనవరి 3 (శనివారం): హజ్రత్ అలీ పుట్టినరోజు (కొన్ని ప్రాంతాల్లో సెలవు).
జనవరి 12 (సోమవారం): స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం).
మొత్తం మీద చూస్తే, జనవరి 2026లో విద్యార్థులకు దాదాపు 10 నుండి 12 రోజులు, ఉద్యోగులకు (వీకెండ్స్‌తో కలిపి) మంచి సెలవులు దొరుకుతున్నాయి. ఆఫీసు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు, పిల్లలతో కలిసి గడిపేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ సెలవులను వృధా చేసుకోకుండా, ఇప్పుడే మీ డైరీలో మార్క్ చేసుకోండి!