ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. మారుమూల గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన ప్రభుత్వం, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చింది. గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ వంతెనలు, కల్వర్టులు నిర్మించేందుకు నిర్ణయించింది. దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లో రాకపోకలు సులభం కానున్నాయి.
ఈ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో రూ.154 కోట్లను మంజూరు చేయగా, ఈ ఏడాది రాష్ట్రానికి రూ.98 కోట్లను గ్రాంట్‌గా విడుదల చేసింది. ఈ నిధులతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నదులు, వాగులు, చిన్న కాలువలపై హైలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించడం ద్వారా ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించనున్నారు.
ప్రస్తుతం దాదాపు 20 గ్రామాల ప్రజలు రోడ్డు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రూ.3 కోట్ల వ్యయంతో 1 నుంచి 3 కిలోమీటర్ల వరకు బీటి రహదారులు నిర్మించనున్నారు. అలాగే పాడేరు పరిధిలో కాఫీ సాగు చేస్తున్న రైతుల కోసం రూ.10 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను కేంద్రం మంజూరు చేయగా, ఇప్పటికే రూ.5 కోట్లు విడుదల చేసి టెండర్ ప్రక్రియ పూర్తిచేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం పూజారిపాకల వద్ద రూ.5 కోట్లతో రబ్బర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.2.50 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రబ్బర్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో రెండు జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ.50 లక్షలు విడుదల చేశారు.
రోడ్లతో పాటు గిరిజన ప్రాంతాల్లో స్టడీ సర్కిల్స్, యూత్ ట్రైనింగ్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల డార్మెటరీలు, కమ్యూనిటీ హాల్స్, వరద రక్షణ గోడలు, పర్యాటక కాటేజీల అభివృద్ధి చేపట్టనున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం కోసం రూ.39.54 కోట్లతో ఇన్వర్టర్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన ఆర్టికల్ 275 నిధులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం యూసీలు సమర్పించడంతో కేంద్ర నిధులు తిరిగి వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో గిరిజనుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి.